హాజీపూర్ అత్యాచార ఘ‌ట‌న‌లో నిందితుడికి త్వ‌ర‌లో శిక్ష ఖ‌రారు

By సుభాష్  Published on  12 Dec 2019 2:50 PM GMT
హాజీపూర్ అత్యాచార ఘ‌ట‌న‌లో నిందితుడికి త్వ‌ర‌లో శిక్ష ఖ‌రారు

హాజీపూర్ ఘ‌ట‌న‌పై త్వ‌ర‌లో విచార‌ణ పూర్తికానుంది. ఈ హాజీపూర్ అత్యాచారాల ఘ‌ట‌న‌ల‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయ‌గా, విచార‌ణ పూర్తి కానుంది. త్వ‌ర‌లో నిందితుడు శ్రీ‌నివాస్‌రెడ్డికి శిక్ష ఖ‌రారు కానున్న‌ట్లు తెలుస్తోంది. ముగ్గురు మైన‌ర్ల‌ను అత్యాచారం చేసిన నిందితుడు శ్రీ‌నివాస్‌రెడ్డి.. మూడేళ్ల‌లో ముగ్గురు బాలిక‌ల‌ను పాశ‌వికంగా హ‌త్య చేశాడు. ఈ నేప‌థ్యంలో దిశ ఘ‌ట‌న‌ను అత్యంత సీరియ‌స్‌గా తీసుకున్న తెలంగాణ ప్ర‌భుత్వం, హాజీపూర్ ఘ‌ట‌న‌పై కూడా ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ఆదేశాలు జారీ చేసింది. దీంతో న‌ల్గొండ కోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసిన అధికారులు.. ఈ కేసుపై 20 రోజుల క్రితం విచార‌ణ ప్రారంభించారు.

గత ఏప్రిల్‌ 25న బొమ్మలరామారంలోని పాఠశాల నుంచి హాజీపూర్‌కు తిరిగి వెళ్తుండగా శ్రావణి (16) అదృశ్యమైంది. అదే రోజు రాత్రి ఆమె తల్లిదండ్రులు బాలిక అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. మరుసటి రోజు ఏప్రిల్‌ 26న శ్రీనివాస్‌రెడ్డి బావిలో శ్రావణి మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింది శ్రీ‌నివాస్‌రెడ్డేన‌ని గుర్తించిన పోలీసులు, అత‌న్ని అదుపులోకి తీసుకొని విచారించ‌గా, అంద‌రు షాకయ్యే నిజాలు బ‌ట్ట‌బ‌య‌లు అయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన హాజీపూర్‌ వాసులు శ్రీనివాస్‌రెడ్డి ఇంటిని తగలబెట్టారు. అదే గ్రామానికి చెందిన తిప్పరబోయిన మనీషా (20) ఇంట‌ర్మీడియేట్ చదువుతోంది. ఈ అమ్మాయి ఈ ఏడాది మార్చి 9న అదృశ్యమైంది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శ్రావణి హత్య అనంత‌రం శ్రీ‌నివాస్ రెడ్డి ఒక్కొక్క దారుణాలు బ‌య‌ట‌కు రావ‌డంతో పోలీసులు త‌మ‌దైన శైలిలోవిచార‌ణ జ‌రిపారు. మార్చిలో అదృశ్యమైన మనీషానూ తానే అత్యాచారం చేసి హత్య చేశానని పోలీసుల ముందు అంగీక‌రించాడు. దీంతోపాటూ 2015 ఏప్రిల్‌ 22న అదృశ్యమైన మైసిరెడ్డిపల్లికి చెందిన కల్పన (11)నూ తానే హత్య చేశానని అంగీకరించడంతో యావత్‌ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముక్కుపచ్చలారని బాలికలను అత్యాచారం చేసి హత్య చేయడంతో నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆ రెండు గ్రామాల ప్రజలతో పాటూ ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఇక దిశ ఘ‌ట‌న నేప‌థ్యంలో ఈ కేసుపై కూడా ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేసి విచార‌ణ జ‌రిపారు. త్వ‌ర‌లో విచార‌ణ పూర్తి కానుండ‌టంతో నిందితుడు శ్రీ‌నివాస్‌రెడ్డికి శిక్ష ఖ‌రారు కానుంది.

Next Story