ఎన్నికల వేళ.. ట్రంప్ మరో కీలక నిర్ణయం
By సుభాష్ Published on 29 Oct 2020 7:35 AM GMTఅమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బీ వీసాల జారీలో ప్రస్తుతమున్న కంప్యూటరైజ్డ్ లాటరీ పద్దతిని రద్దు చేసేందుకు ట్రంప్ పాలక వర్గం ముందుకొచ్చింది. ఈ మేరకు ఫెడరల్ రిజిస్టర్‌లో నోటిఫికేషన్ పెట్టింది. ఈ నోటిఫికేషన్‌పై 30 రోజుల్లోగా స్పందనలు తెలియజేయవచ్చని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ వెల్లడించింది.
అమెరికన్ల ఉద్యోగ భద్రత కల్పించేందుకు గత కొంతకాలంగా హెచ్-1బీ వీసాల జారీలో అనేక నిబంధనలు తీసుకొచ్చిన ట్రంప్.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు లాటరీ పద్దతికి స్వస్తి పలకనున్నారు. అయితే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు నైపుణ్యం ఉన్నవారికి మాత్రమే తమ దేశంలో స్థానం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు గతంలో ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. లాటరీ విధానాన్ని రద్దు చేసి ఇకపై గరిష్ఠ వేతన స్థాయి ఆధారంగా హెచ్-1బీ వీసాలు జారీ చేయాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించింది.
ఈ కొత్త విధానం ఏమిటీ..?
కాగా, ప్రతి సంవత్సరం హెచ్-బీ వీసాల కోసం లక్షలాదిగా దరఖాస్తులు వస్తుంటాయి. ఈ దరఖాస్తుల్లో కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్దతి ద్వారా 65 వేల దరఖాస్తులను ఎంపిక చేసి వీసాలు జారీ చేస్తుంటారు. ఈ విధానం ద్వారా అమెరికా కంపెనీలు సులువుగా లభించే విదేశీ ఉద్యోగులను తీసుకుంటుండటంతో స్థానికులకు అవకాశాలు పెద్దగా లభించడం లేదని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అందుకే వీసాల జారీ విషయంలో భారీ మార్పులు చేపడుతోంది.