నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలింది
By సుభాష్ Published on 23 Aug 2020 4:39 AM GMTహర్యానాలోని గురుగ్రామ్‌లో శనివారం అర్దరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోహ్నా రోడ్డులో ఆరు కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఫ్లైఓవర్ ప్రమాదశాత్తు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మాత్రమే గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) బృందం, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం, సివిల్ డిఫెన్స్ బృందం ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కూలిన శిథిలాలను తొలగిస్తున్నారు.
కాగా, అసిస్టెంట్ పోలీసు కమిషనర్ అమన్ యాదవ్ సిబ్బందితో కలిసి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ లేని కారణంగా పెద్ద ప్రమాదం తప్పిందని, ఇద్దరు మాత్రమే గాయపడ్డారని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అమన్ యాదవ్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే తమకు సమాచారం అందిందని, వెంటనే సిబ్బందితో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామన్నారు. శనివారం నగరంలో షాపులన్నీ మూసి ఉండటంతో పెద్దగా ట్రాఫిక్ లేదని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన అన్నారు. కాగా, గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా తెలిపారు.
ఆరు కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ను రూ. 2వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులను ఓరియంటల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ కంపెనీ చేపట్టింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఫ్లైఓవర్‌లోని ఎలివేటెడ్ రోడ్డులోని కొంత భాగం కూలిపోయిందని ప్రాజెక్టు అధికారి శైలేష్‌సింగ్ తెలిపారు. అయితే ఫ్లైఓవర్ నిర్మాణంలో నాణ్యత పాటించలేదని, అందుకే కూలిపోయిందని పలువురు ఆరోపిస్తున్నారు.