11 ఏళ్ల తెలుగు బాలిక గిన్నిస్ రికార్డ్

By Newsmeter.Network  Published on  1 Jan 2020 8:37 AM GMT
11 ఏళ్ల తెలుగు బాలిక గిన్నిస్ రికార్డ్

ముఖ్యాంశాలు

  • 8 ని.లో 136 బాణాలను టార్గెట్ కి సంధించిన చందన
  • 10 మీటర్ల టార్గెట్ ని గురి తప్పకుండా కొట్టిన చందన
  • అసలు లక్ష్యం 15 నిమిషాల్లో 76 బాణాలు వేయడం
  • తన అంచనాలనే మించి రాణించిన చందన
  • గాజులమల్లారంలోని తత్త్వ గ్లోబల్ స్కూల్లో ఈవెంట్
  • కేరళలో జరిగిన రూరల్ గేమ్స్ లో బంగారు పతకం
  • ఆసియా పసిఫిక్ రూరల్ గేమ్స్ కి అర్హత
  • గత ఏడాది జూన్ నెలనుంచి ఆర్చరీ ప్రాక్టీస్

రెండు చేతులతో ఎడాపెడా బాణాలు వేసి శత్రుసేనల్ని చిత్తుచేసిన సవ్యసాచి అర్జునుడి గురించి పురాణకథల్లో విన్నాం. కేవలం గురువు బొమ్మని ఎదురుగా పెట్టుకుని అంకుంటిత సాధనతో అప్రతిహతమైన ధనుర్విద్యను అభ్యసించిన ఏకలవ్యుడి గురించి విన్నాం.

పాండవులకూ, కౌరవులకూ విలువిద్యను నేర్పిన అసమాన ప్రతిభాశాలియైన ద్రోణుడి గురించి విన్నాం. కురుక్షేత్ర సంగ్రామంలో మృత్యువును తలపించే రీతిలో విరుచుకుపడి శత్రుసైన్యాన్ని చెండాడిన భీష్మ పితామహుడి గురించి విన్నాం. ఇలాంటి సాటిలేని మేటి విలుకాళ్లు కాలుమోపిన ఈ పుణ్యభూమిలో ఆ విలువిద్యాపాటవాన్ని యుగాలు, తరాలుమారినా ప్రపంచానికి చాటుతున్న ఈనాటి మేటి విలుకాళ్లూ ఉన్నారు.

వాళ్లలో చిన్న వయసులోనే సాటిలేని మేటి అద్భుతాలను సాధించి ఎనలేని కీర్తిని అర్జిస్తున్న ఓ బుల్లి విలువిద్యాక్రీడాకారిణి తప్పని గురి గురించికూడా తెలుసుకుని తీరాల్సిందే. చందన సాయి అంజని బేతు. ఆర్చరీ పోటీల్లో జాతీయ స్థాయిలో మెరుపులు మెరిపిస్తున్న పదకొండేళ్ల బాలిక హైదరాబాద్ నివాసి అని చెప్పుకోవడానికి భాగ్యనగర ప్రజలు గర్వపడే స్థాయిలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తోంది.

గాజులమల్లారంలోని తత్త్వ గ్లోబల్ స్కూల్లో జరిగిన ఓ ఈవెంట్ లో చందన సాయి కేవలం ఎనిమిదంటే ఎనిమిది నిమిషాల్లో 136 బాణాల్ని నేరుగా టార్గెట్ కు సంధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. ఈ స్కూల్లోనే ఆరో తరగతి చదువుతున్న ఈ బాలిక ఐదు నిమిషాల్లో పదిమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ కి పదిహేను నిమిషాల్లో 76 బాణాలను సూటిగా సంధించేందుకు ప్రయత్నించింది.

ఆశ్చర్యకరంగా తనే నమ్మలేని విధంగా చందన కేవలం ఎనిమిది నిమిషాల్లో 136 బాణాలను టార్గెట్ కి సంధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పదిమీటర్ల దూరం విభాగంలో ఇది ప్రపంచస్థాయి రికార్డ్. ఆంధ్రప్రదేశ్ లోని భీమవరానికి చెందిన చందన కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది. తనకు చిన్నప్పట్నుంచీ ఆర్చరీ అంటే చాలా ఇష్టం. కూతురు ఇష్టాన్ని గమనించిన చందన తండ్రి సత్యనారాణయ ప్రత్యేక శ్రద్ధతో ఆమెకు అందులో శిక్షణ ఇప్పించారు.

ఈసీఎల్ఎటి స్పోర్ట్స్ అకాడమీకి చెందిన కోచ్ లు రమేష్, గంగరాజు చందనకు చాలాకాలంగా ఆర్చరీలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. గత ఏడాది జూన్ లో ఆర్చరీ నేర్చుకోవడం మొదలుపెట్టిన చందన అనతికాలంలోనే అద్భుతాలు సాధించే స్థితికి ఎదిగింది. ఎన్నో మెడల్స్ సాధించి చూపించింది.

ఆసియా పసిఫిక్ రూరల్ గేమ్స్ కి అర్హత

అండర్ 14 విభాగంలో గండిపేటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహించిన 65 వ జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఈవెంట్ లో చందన రన్నర్ అప్ గా నిలిచింది. కేరళలోని మున్నార్ లో అండర్ 14 విభాగంలో 50 మీటర్ల కేటగిరీలో జరిగిన రూరల్ గేమ్స్ ఫెడరేషన్ కప్ లో చందన గోల్డ్ మెడల్ సాధించి 2020లో థాయ్ ల్యాండ్ లో జరిగే ఆసియా పసిఫిక్ రూరల్ గేమ్స్ కి అర్హత సాధించింది.

తను ఎన్ని విజయాలు సాధించినా అవన్నీ తన తల్లిదండ్రులగొప్పేనని ముద్దులు మూటగడుతూ చెబుతుందీ చిన్నారి పాప. తండ్రి సత్యనారాయణ, తల్లి శ్రీలక్ష్మి అనుక్షణం తనని ప్రోత్సహిస్తారనీ, తనకు ఎప్పుడు ఏదీ కావాలన్నా సరే వెంటనే తెచ్చిస్తారనీ చెబుతోంది. చందన ఆర్చరీ మాత్రమే కాక బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, స్కేటింగ్ క్రీడల్లోకూడా అద్భుతమైన ప్రతిభను కనబరుస్తోంది.

తను నిర్ణయించుకున్న టార్గెట్ ని తనే తెలియకుండానే అధిగమించడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని చందన అంటోంది. అకుంటిత దీక్షతో సాధన చేయడంవల్లే తనకు అంతటి ఏకాగ్రత కుదురుతోందని చెప్పింది. ఆసియాపసిఫిక్ రూరల్ గేమ్స్ లో తప్పనిసరిగా అద్భుతాలు సాధించే ప్రయత్నం చేసి రాణిస్తానంటోంది. ఏదో ఒక రోజున భారత దేశం తరఫున ఈ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాలన్న తన కలని చెబుతోంది చందన.

Next Story