పెళ్లి మంటపానికి వస్తున్న వరుడి పై..

By రాణి  Published on  5 Feb 2020 12:41 PM GMT
పెళ్లి మంటపానికి వస్తున్న వరుడి పై..

ఎన్నో ఆశలతో అతను పెళ్లి మంటపానికి చేరుకున్నాడు. ఊరేగింపు చాలా ఘనంగా జరిగింది. ఇంతలోనే జరిగిన ఊహించని ఘటనతో వరుడు ప్రాణాలు కోల్పోయాడు. వరుడు పెళ్లి మంటపంలోకి వెళ్తున్న సమయంలో ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి వరుడిపై కాల్పులు జరిపి ఉడాయించారు. వెంటనే బంధువులు వరుడిని ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మరికొద్దిసేపటిలో పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి విగతజీవిగా మారడంపై బంధువులు ఆందోళన చెందారు. ఆస్పత్రి ఎదుట బైఠాయించగా..పోలీసులు వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని పోస్టు మార్టంకు పంపించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని దేవ్ గావ్ పీఎస్ పరిధిలో గల మసీర్ పూర్ బజార్ ప్రాంతంలో జరిగిందీ దుర్ఘటన.

వరుడి మృతి పట్ల బంధువులంతా సంతాపం తెలిపారు. ఆనందంగా ఉండాల్సిన ఆ ఇల్లు శోకసంద్రమయింది. కాగా..పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా వరుడు, వధువు కుటుంబ సభ్యులందరినీ ప్రశ్నించారు. హంతకులు వరుడి ఊరేగింపుకు కొద్ది దూరం నుంచి వెంబడిస్తూ వచ్చారు కానీ ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవని పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పెళ్లికి సంబంధించిన వీడియో ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు.

Next Story
Share it