అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు కేంద్రం నోటీసులు జారీ
By సుభాష్
దసరా, దీపావళి పండగ సీజన్ నేపథ్యంలో వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు గ్రేట్ ఇండియా సేల్స్, బిగ్ బిలియన్ డేస్ పేరిట భారీ ఆఫర్లను ప్రకటించాయి అమెజాన్, ప్లిప్‌కార్ట్. అయితే వీటి ఆఫర్లపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆయా వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచిన వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయి, ఇతర మూలాలు తెలిపే సమాచారం పొందుపర్చకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ రెండు ఈ-కామర్స్ దిగ్గజాలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై స్పందించేందుకు 15 రోజుల సమయం మాత్రమే ఇచ్చింది. ఇకపై ఈ నిబంధనలను ఏ ఈ-కామర్స్ సంస్థ ఉల్లంఘించరాదని కేంద్రం స్పష్టం చేసింది.
కాగా, దసరా, దీపావళి పండగల నేపథ్యంలో ఈ రెండు ఈ - కామర్స్ సంస్థలు కూడా భారీ ఆఫర్లను ప్రకటించాయి. బిగ్‌బిలియన్ డేస్ పేరుతో ఫ్లిప్‌కార్ట్ 16 నుంచి 21 వరకు ఆఫర్లను ప్రకటించగా, గ్రేట్ ఇండియా ఫెస్టివెల్ పేరుతో అమెజాన్ ఆఫర్లు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ ఆఫర్లకు వారం రోజుల ముందు నుంచి ఆయా సోషల్ మీడియాలో, టీవీల్లో ప్రకటనలు ఇస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.