సరిహద్దులు మూసివేసిన తమిళనాడు ప్రభుత్వం

By Newsmeter.Network  Published on  21 March 2020 6:51 AM GMT
సరిహద్దులు మూసివేసిన తమిళనాడు ప్రభుత్వం

భారత్‌లో వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడులోకి వాహనాలను ప్రవేశించకుండా చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. అత్యవసరమైన వాహనాలు మినహా మిగిలిన వాహనాలన్నింటిని రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌ పోస్టుల వద్దనే నిలిపివేస్తున్నారు. కర్ణాటక , ఏపీల నుంచి వస్తున్న వాహనాలను అక్కడి అధికారులు సరిహద్దుల్లోనే నిలిపివేశారు. మొత్తం 19 చెక్‌పోస్టుల వద్ద వాహనాలను తమ రాష్ట్రంలోకి రాకుండా నిలిపివేసినట్లు తెలుస్తుంది. ఆంధ్రా – తమిళనాడు సరిహద్దుల్లోని వాహనాలను శనివారం ఉదయం 6గంటల నుంచే నిలిపివేశారు. అత్యవసరమైన వాహనాలు మినహా ఏ ఒక్క వాహనాన్ని తమిళనాడులోనికి ప్రవేశించకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. కాయగూరలు, పాలు, అంబులెన్స్‌లు లాంటి వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఈ వాహనాలనుసైతం క్లీనర్‌లు, డ్రైవర్లు, వాహనంలోని ఇతర సిబ్బందికి పూర్తిగా ధర్మల్‌ స్క్నీనింగ్‌ చేసిన తరువాతనే అనుమతిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న అనూహ్య నిర్ణయంతో తమిళనాడు, చెన్నై ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తమిళనాడులో ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావం కొంతమేరనే ఉంది. ఆ రాష్ట్రంలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఒకరిని వైద్య చికిత్సలు పూర్తయిన అనంతరం డిచ్చార్జి చేశారు. ఇదిలా ఉంటే తమిళనాడుకు సరిహద్దు రాష్ట్రాలైన కేరళలో కరోనా వైరస్‌ విజృంభిస్తుంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో 43 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరికొందరు అనుమానితులకు వైద్య పరీక్షలు అందిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ మూడు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వైరస్‌ అనుమానిత లక్షణాలున్న వారిని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి తమిళనాడులోకి వాహనాల ద్వారా కరోనా వైరస్‌ బాధితులు ఎవరైనా వస్తే తమిళనాడులోని ప్రజలకు వైరస్‌ సోకే అవకాశం ఉందని భావిస్తున్న తమిళనాడు ప్రభుత్వం సరిహద్దుల్లోని చెక్‌ పోస్టుల వద్ద వాహనాలను నిలిపివేసింది.

Next Story