లాక్‌డౌన్‌పై గూగుల్ నిఘా
By సుభాష్ Published on 4 April 2020 10:02 AM GMTకరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. భారత్‌లో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక కరోనాను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పది లక్షలు, మరణాలు 50వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ కరోనా వైరస్ కారణంగా సామాజిక దూరం పాటించాలని చెబుతున్నా.. కొందరికి చెవికెక్కడం లేదు. ఈ నేపథ్యంలో గూగుల్ ఓ వినూత్న ఆలోచన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న తీరుపై విశ్లేషణకు ఓ ప్రత్యేకమైన వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొబైల్ వినియోగదారుల నుంచి సేకరించిన లొకేషన్ సమాచారం ఆధారంగా 131 దేశాల్లో ప్రజల కదలికలపై రిపోర్ట్‌ను అందులో పొందుపర్చింది. లాక్‌డౌన్ నేపథ్యంలో పలు చోట్లకు జనం కదలికల్లో హెచ్చుతగ్గుల శాతాల వారీగా అందిస్తోంది. ఇది కేవలం ప్రజల కదలికల గురించి శాతాల వారీగా విశ్లేషణ మాత్రమేనని గూగుల్ మ్యాప్స్ అధిపతి, గూగుల్ హెల్త్ చీఫ్ అధికారి కరెన్ డెస్వాలో తెలిపారు. వ్యక్తుల కదలికలను సంబంధించిన ఖచ్చితమైన సంఖ్య, లేదా వారి వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం లేదని ఆయన పేర్కొన్నారు.
ఏఏ ప్రాంతాల్లో జనాల రద్దీ ఎలా ఉన్నది తెలుసుకునేందుకు తమ సమాచారం ఉపయోగపడుతుందన్నారు. దీని ద్వారా ప్రజల అవసరాలను గుర్తించి ఆ మేరకు ప్రభుత్వాలు చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. గూగుల్ మ్యాప్స్‌లో ఇప్పటికే ఈ విధానం అందుబాటులో ఉంది. లొకేషన్ ఫీచర్ ఆధారంగా రద్దీ ఉండే ట్రాఫిక్ సిగ్నల్స్, మార్గాలు, ప్రాంతాలను మొబైల్ వినియోగదారులకు గూగుల్ సూచిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, మరో వైపు వ్యక్తిత గోప్యత హక్కును గూగుల్ హరిస్తుందన్న ఆరరోపణలూ వినిపిస్తున్నాయి.
ఇక భారత్‌లో ఫిబ్రవరి 16 నుంచి మార్చి 29వ తేదీ వరకు ప్రజల కదలికలపై విశ్లేషణను గూగుల్ విడుదల చేసింది. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, ఇతర ప్రాంతాలను సందర్శించిన వారి సంఖ్య 77 శాతం తగ్గినట్లు గుర్తించింది. అలాగే మెడికల్ షాప్‌లకు 65 శాతం, పార్కులు, తీర ప్రాంతాలకు 57 శాతం మేరకు కదలికలు తగ్గినట్లు గూగుల్ పేర్కొంది. ఇక రైల్వేస్టేషన్లు, ఎయిర్ పోర్టు వంటి ప్రయాణ ప్రాంతాలకు ప్రజల కదలికలు 71 శాతం తగ్గగా, పని చేసే ప్రాంతాల సందర్శనలో 47 శాతం తగ్గుదల కనిపించిందని తెలిపింది. మరో వైపు నివాసం ప్రాంతాల్లో ప్రజల కదలికలు 22 శాతం వరకు పెరిగినట్లు గూగుల్ విశ్లేషించింది.