కోట్ల రూపాయల మోసం చేసి పరారీ అయిన జ్యువెలరీ షాప్ యజమానులు !!
By సత్య ప్రియ Published on 28 Oct 2019 6:35 AM GMTకోట్ల రూపాయలు మోసం చేశారంటూ ముంబయిలోని గుడ్విన్ జ్యువలర్స్ యాజమాన్యంపై ఆదివారం కేసు నమోదైంది. ముంబైలోని డోంబివలీ షాపు వద్ద సుమారు 300 మంది బాధితులు వచ్చి చేరారు. ముంబైలోని రామ్‌నగర్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. గుడ్‌విన్ జ్యుయలరీ షాపులను సీజ్ చేశారు.
ఆకర్షణీయ వడ్డీ, ఇతర ఆఫర్ల పేరుతో పెద్దమొత్తంలో డబ్బులు దండుకుని అనంతరం పరారీ అయ్యారు.
“పోయిన 4 రోజుల నుంచీ దుకాణం వద్దకి వస్తున్నాం, షాపు రెండు రోజులు మూసి వేస్తున్నాం అనే బోర్డు పెట్టి ఉంది. వారు మా డబ్బు తీసుకొని పారిపోయారు.సుమారుగా, 500 మంది ఈ దుకాణం లో పెట్టుబడులు పెట్టారు.” అని ఒక వినియోగదారుడు చెప్పాడు
గుడ్‌విన్ గ్రూప్ ఛైర్మన్ ఎం సునీల్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్, ఎం.సుధీర్ కుమార్; గుడ్‌విన్ జ్యువెలర్స్ డొంబివ్లి బ్రాంచ్ మేనేజర్ మనీష్ కుండి నిందితులుగా ఉన్నారు. అక్టోబర్ 21 నుంచే యజమానులు ఇద్దరూ పరారీలో ఉన్నారు. షాపులను మూసి వేసి కుటుంబ సభ్యులతో సహా ఉడాయించారనీ, ఈ ఒక్క డొంబివ్లి శాఖ లోనే వెయ్యిమంది దాకా ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది.
నిందితులు పాస్‌పోర్ట్ వివరాలను సేకరిస్తున్నామనీ, లుక్ అవుట్ నోటీసులు జారీకి యోచిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే ప్రభుత్వ రైల్వే పోలీసులను, పోలీసు కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేశారు. నిందితుల కుటుంబ సభ్యుల కోసం ఆరాతీస్తున్నారు.