ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎవరికి వారు పరిమితం కాకుండా.. తన మాదిరే ఎంత మంది ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారో? అన్న ప్రశ్న వేసుకుంటే జరిగే మేలు ఎంతన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఊహించని రీతిలో విరుచుకుపడిన కరోనా నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు అన్ని ఇన్ని కావు. వ్యవస్థలు దాదాపుగా స్తంభించిపోయిన ఈ వ్యవహారంలో చాలామంది నష్టపోయారు. తమ తప్పు లేకుండా తమకు జరిగిన నష్టం మీద.. ఒక సంఘం చేసిన న్యాయపోరాటం.. వేలాది మందికి వేలు చేసేలా చేసింది. అదెలానంటే..
విదేశాల్లో ఉండే పలువురు ప్రవాస భారతీయులు స్వదేశానికి రావటానికి వీలుగా.. నెలల ముందే టికెట్లను రిజర్వు చేసుకుంటారు. ఇలా చేసుకున్న వారు వేలాది మంది ఉంటారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించటంతో విమాన సర్వీసుల్ని నిలిపివేశారు. దీంతో.. వారు బుక్ చేసుకున్న టికెట్లు చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు. దీంతో.. భారీగా నష్టం వాటిల్లింది.

దీనిపై ప్రవాసీ లీగల్ సెల్ అనే స్వచ్ఛంద సంస్థ ఒకటి తనకుతానుగా ముందుకు వచ్చి.. లాక్ డౌన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వేలాది మందికి.. ఫుల్ రిఫండ్ ఇప్పించాల్సిందిగా కోరింది. దీంతో స్పందించిన సుప్రీం.. ఈ అంశంపై తన వాదనను వినిపించాలని కేంద్రాన్ని కోరింది. దీనిపై స్పందించిన కేంద్రం తాజాగా తన కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. విమాన సంస్థలు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఫుల్ రిఫండ్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.

ఒకవేళ.. విమానయాన సంస్థలు ఫుల్ రిఫండ్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే.. అందుకు బదులుగా వారుకోరుకున్న తేదీలో ప్రయాణించేలా అవకాశం ఇవ్వాలని చెప్పింది. ప్రయాణానికి మార్చి 31, 2021 కటాఫ్ డేట్ గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ వేళలో ప్రయాణ టికెట్లను బుక్ చేసుకున్న వారికి కొన్ని సదుపాయాల్ని కల్పించనున్నట్లుగా పేర్కొంది.

ఇందులో భాగంగా టికెట్ బుక్ చేసుకున్న రూట్లలో కాకుండా.. తమకు నచ్చిన రూట్లలోనూ ప్రయాణించే వీలుతో పాటు.. తాము బుక్ చేసిన టికెట్ ను వేరే వారికి బదిలీ చేసే సదుపాయాన్ని కల్పించనున్నట్లు కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి వెల్లడించింది. మార్చి 25 నుంచి మే 3 మధ్యలో జాతీయ.. అంతర్జాతీయ విమాన టికెట్లను కొనుగోలు చేసిన ప్రయాణికులందరికి ఈ నిబంధనల్ని వర్తిస్తాయని కేంద్రం పేర్కొంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *