చెన్నై: సాహితీవేత్త, ప్ర‌ముఖ న‌టుడు, జ‌ర్న‌లిస్ట్, ర‌చ‌యిత గొల్ల‌పూడి మారుతీరావు పార్థివదేహనికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కన్నమ్మపేట శ్మశాన వాటిలో గొల్లపూడి అంత్యక్రియలను పెద్ద కుమారుడు సుబ్బరావు నిర్వహించారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గత మూడు రోజుల క్రితం చైన్నైలోని ఓ ప్ర‌వైట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గొల్లపూడి కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉండటంతో ఇవాళ్టికి అంతిమ సంస్కారాలను వాయిదా వేశారు. టి.నగర్‌లోని ఆయన నివాసంలో గొల్లపూడి భౌతికకాయానికి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, చిరంజీవి, సుహాసిని, సినీ నిర్మాత కాట్రగడ్డ మురారితో పాటు పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గొల్లపూడితో ఉన్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. గొల్లపూడి మారుతిరావుతో తనకున్నది గురుశిష్య సంబంధమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మారుతీరావు కుటుంబ సభ్యులకు సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఇంటి నుంచి ప్రారంభమైన చివరి అంతిమయాత్రలో గొల్లపూడి అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు భారీగా పాల్గొన్నారు. గొల్లపూడి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

1939 ఏప్రిల్ 14న విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జ‌న్మించిన గొల్ల‌పూడి.. సినిమాల్లోకి రాక‌ముందు ఆకాశ‌వాణిలో ప‌నిచేసేవారు. ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య సినిమా ద్వారా సినీరంగ ప్ర‌వేశం చేసిన ఆయ‌న సుమారు 290 సినిమాల్లో న‌టించారు. గొల్ల‌పూడి కేవ‌లం న‌టుడిగానే కాకుండా.. ర‌చ‌యిత‌గా, సంపాద‌కుడిగా బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి. సినిమాలోకి రాక‌ముందు న‌వ‌ల‌లు, నాట‌కాలు, క‌థ‌లు రాసేవారు. 1996లో ఉత్త‌మ టీవీ న‌టుడిగా నంది పుర‌స్కారాన్ని అందుకున్న గొల్ల‌పూడి.. అనంత‌రం ఆరు నంది అవార్డుల‌ను అందుకున్నారు. గొల్ల‌పూడి ర‌చ‌న‌ల‌ను యూనివ‌ర్సిటీల‌లో పాఠ్యాంశాలుగా బోధిస్తున్నారంటే ఆయ‌నెంత గొప్ప ర‌చ‌యిత అర్థం చేసుకోవ‌చ్చు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.