ట్రోఫీలు అమ్మి.. విరాళం ఇచ్చాడు
By తోట వంశీ కుమార్ Published on 8 April 2020 1:48 PM GMTకరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికి మన దేశంలో లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు.
కరోనా పోరుకు ఇప్పటికే చాలా మంది క్రీడాకారులు, సెలబ్రెటీలు తమ వంతు సాయం అందించారు. తాజాగా భారత గోల్ప్ క్రీడాకారుడు అర్జున్ భాటి తాను సాధించిన ట్రోఫీలన్నింటిని అమ్మి వచ్చిన మొత్తాన్ని ప్రధాన మంత్రి సహాయనిధికి విరాళంగా అందించాడు. గత ఎనిమిదేళ్లతో తాను సాధించిన 102 ట్రోఫీలను విక్రయించగా.. వచ్చిన రూ.4.30లక్షలను పీఎం కేర్స్‌కు అందించాడు. 15 ఏళ్ల వయసులోనే తన గొప్ప మనసు చాటుకుని అందరికి ఆదర్శంగా నిలిచాడు.
నోయిడా పట్టణంలోని గ్రేటర్ వ్యాలీ స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్నాడు అర్జున్ భాటి. జూనియర్ స్థాయిలో మూడు ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిళ్లు, జాతీయ చాంఫియన్ షిప్ లతో పాటు అర్జున్ భాటి మొత్తం 102 ట్రోఫీలు సాధించాడు.
కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో తనకు వంతు సాయం చేయాలని భావించానని, తాను గత 8 సంవత్సరాల్లో సాధించిన 102 ట్రోపీలను అమ్మగా వచ్చిన రూ.4.30లక్షలను పీఎం కేర్స్ విరాళంగా ఇచ్చానని అర్జున్ అన్నాడు. తన వద్ద డబ్బు లేకపోవడంతో తనకు వచ్చిన ట్రోఫీలకు బందువులకు, స్నేహితులకు విక్రయించానని తెలిపాడు. దేశానికి తన వంతు సాయం చేశానని, ట్రోఫీలను భవిషత్తులో కూడా సంపాదించుకోవచ్చునని అన్నాడు. అర్జున్ భాటి ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.