4 నెలల క్రితం 'అమెరికా' తప్పిపోయింది.. బ్రిటన్ ఇప్పటికీ వెతుకుతోంది..
By Newsmeter.Network Published on 1 Jan 2020 12:54 PM ISTఅవునండీ... “అమెరికా” తప్పిపోయింది. అమెరికా ఖండం తప్పిపోవడమేమిటి అనుకుంటున్నారా? కాదండీ బాబు.. అమెరికా అనేది ఒక టాయ్ లెట్ కమోడ్. బంగారు తాపడం పెట్టిన మహాద్భుత కమ్మోడ్ అది. ఇటాలియన్ కళాకారుడు మారిజియో కాటెలాన్ అనే ఆర్టిస్టు రూపొందించిన ఈ “కళాఖండం” ఇంగ్లండ్ రాజధాని లండన్ నగరంలోని బ్లెన్ హీమ్ ప్యాలెస్ లో ప్రదర్శనకు పెట్టారు. విజిటర్స్ దీన్ని వాడుకునేందుకు మూడు నిముషాల సమయాన్ని కూడా బుక్ చేసుకోవచ్చునట. దీన్ని వాడుకునేందుకు భలే రష్ ఉందనుకొండి. అది వేరే విషయం.
ఇదిలా ఉండగా ఈ బంగారు టాయ్ లెట్ ను కాస్తా ఎవరో ఎత్తుకుపోయారు. “పాయిఖానాని కూడా ఎత్తుకుపోతారా” అని బుగ్గలు నొక్కుకునేవారు నొక్కుకోవచ్చు గాక. కానీ కళాఖండం లాంటి దీన్ని అమ్ముకుంటే పదిలక్షల శౌచాలయాలు కట్టుకునేంత డబ్బులు వస్తాయి. అందునా పధ్దెనిమిది క్యారెట్ల బంగారంతో చేసిన టాయిలెట్ అది. దాని మొత్తం విలువ ఆరు మిలియన్ల డాలర్లు. అందుకే ఎవరో ఎత్తుకెళ్లిపోయారు.దాంతో బ్రిటన్ లో గగ్గోలు మొదలైంది. హడావిడిగా వెతుకులాట ప్రారంభమైంది.
సెప్టెంబర్ 14 న దొంగతనం జరిగినా ఇప్పటివరకూ బంగారు టాయిలెట్ దొరకలేదు. ఇప్పటి వరకూ అరుగురిని అరెస్టు చేశారు. అందులో ఒకరి వయసు 34, ఇంకొకరిది 25. ఒకాయన వయసు 66. అరెస్టయిన ఆరుగురిలో ఒక మహిళ కూడా ఉంది. ఇంతమంది అరెస్టయినా అసలు బంగారు లెట్రిన్ మాత్రం ఇంకా దొరకలేదు.