భారీగా తగ్గిన బంగారం ధర.. అదే దారిలో వెండి కూడా..
By సుభాష్ Published on 30 Jan 2020 3:08 PM GMT
బంగారం ధర దిగొచ్చింది. గత కొన్ని రోజులుగా ఎగబాకిన పసిడి ధర ఇప్పుడు మెల్లమెల్లగా తగ్గుతూ వస్తోంది. వరుసగా రెండో రోజుకూడా తగ్గింది. పసిడి ధరనే కాకుండా వెండి ధర కూడా కింది చూపులు చూసింది. బంగారం, వెండి కొనేవారికి ఇది శుభవార్తేనని చెప్పాలి.
పసిడి తగ్గుదలకు కారణమేంటీ.?
అమెరికా సానుకూల ఆర్థిక గణాంకాల నేపథ్యంలో డాలర్ బలపడింది. దీంతో బంగారం ధరపై ప్రతికూడా ప్రభావం పడింది. అంతేకాదు. బలమైన ఆర్థిక గణాంకాలతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను కూడా తగ్గించవచ్చనే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంశం కూడా బంగారంపై ప్రభావం చూపిందనే చెప్పాలి.
ఎంత తగ్గింది..
హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం రూ.340 తగ్గింది. దీంతో బంగారం ధర రూ. 38,720 నుంచి 38,380 వరకు దిగొచ్చింది. ఇక సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 340 తగ్గుదలతో రూ.42,240 నుంచి 41,900 వరకు తగ్గింది.
అదేదారిలో వెండి కూడా..
బంగారం ధర తగ్గిపోవడంతో అదే దారిలో వెండి కూడా వెళ్తోంది. కిలో బంగారం ధర రూ.400 పతనమైంది. దీంతో రూ.49,600 ఉన్న వెండి ధర ప్రస్తుతం రూ.49,200కు చేరుకుంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో వెండి ధర దిగడానికి కారణమైంది.
ఏపీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.38,380 ఉండగా, కిలో వెండి రూ.49,200 ఉంది. ఇక విశాఖలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 39,200 ఉండగా ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 40,200 ఉంది, కిలో వెండి రూ. 49,200 ఉంది.
ఇక రానున్న కాలంలో పసిడి రేటు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు ఇందుకు కారణమంటున్నారు. మున్ముందు బంగారం ధర రూ.45వేల వరకు పెరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు.