భారీగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎంతంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 May 2020 12:57 PM GMT
భారీగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎంతంటే..?

నిన్న మొన్నటి దాకా చుక్కలు చూపించిన బంగారం ధర క్రమంగా తగ్గుతోంది. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధర భారీగా తగ్గింది. మొన్న‌టి వ‌ర‌కు రూ.50వేల‌కు పైన ఉన్న ప‌సిడి ధ‌ర క్ర‌మంగా దిగివ‌స్తోంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ధ‌ర‌లు త‌గ్గ‌డంతో దేశీయంగా కూడా బంగారం ధ‌ర‌ త‌గ్గ‌డానికి ఓ కార‌ణ‌మ‌ని బులియ‌న్ మార్కెట్ నిపుణులు తెలిపారు. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం రూ .272 తగ్గి 46,050కి దిగివచ్చింది. ఇక కిలో వెండి స్వల్పంగా తగ్గి రూ 47,800 పలికింది.

హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.210 దిగొచ్చింది. దీంతో ధర రూ.45,230కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.140 తగ్గుదలతో రూ.49,010కు దిగొచ్చింది.

అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడినపడుతుందనే సంకేతాలు గోల్డ్‌ ధరలపై ప్రభావం చూపాయని ఆనంద్‌ రాఠీ షేర్స్‌, స్టాక్‌ బ్రోకర్స్‌కు చెందిన పరిశోధనా విశ్లేషకులు జిగర్‌ త్రివేదీ అంచనా వేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితి, వైరస్‌ భయాలు వెంటాడుతున్న క్రమంలో బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని బులియన్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

Next Story