సత్యం సాధించాడు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Oct 2019 3:40 PM ISTతూర్పుగోదావరి: కచ్చులూరు వద్ద గోదావరి నదిలో నెల రోజుల కిందట మునిగిపోయిన వశిష్ట రాయల్ బోటును ఎట్టకేలకు బయటకు తీశారు. లంగర్‌లు, ఐరన్ రోప్‌ల సహాయంతో బోటును సిబ్బంది బయటకు తీశారు. దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం బృందం వెలికితీసింది. బోటును పోర్ట్ అధికారి ఆదినారాయణ టీం ఒడ్డుకు తీసుకురానుంది.పూర్తిగా ధ్వంసమైన స్థితితో వశిష్ట బోటు ఉంది. బోటు శిథిలాల్లో పలు మృతదేహాలు ఉన్నాయి. ఆచూకీ లభ్యం కాని 12 మృతదేహాల్లో ఐదు మృతదేహాలను వెలికితీశారు.
వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 15న పాపికొండల పర్యటనకు 77 మంది యాత్రికులతో బయలుదేరిన బోటు కచ్చులూరు మందం సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 26 మందిని స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగారు. మిగిలిన వారు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 12 మంది ఆచూకీ లభించలేదు. అందులో 5 మృతదేహాలు బోటు వెలికితీత సమయంలో బటయకు వచ్చాయి. బోటును వెలికితీయడంతో పాటుగా మృతదేహాల కోసం సెప్టెంబర్ 28న ఆపరేషన్ ప్రారంభమైంది. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్ సంస్థకు 22.7లక్షల కాంట్రాక్ట్ ఇచ్చారు. ధర్మాడి సత్యం బృందం ఈ పనులు చేపట్టింది. తొలుత ఐదు రోజుల పాటు సాగించిన ప్రయత్నాలు ఫలించలేదు. అదే సమయంలో గోదావరికి వరద పోటెత్తడంతో అక్టోబర్ 3న ఆపరేషన్ నిలిపివేశారు.
గోదావరి శాంతించడంతో అక్టోబర్ 16 నుంచి మరోసారి ప్రయత్నాలు ప్రారంభించారు. తొలుత ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాల ప్రకారం లంగరుకి బోటు తగలడంతో ఒడ్డుకి చేరుతుందని ఊహించినప్పటికీ అది నెరవేరలేదు. దాంతో ప్లాన్ మార్చారు. విశాఖ నుంచి డైవర్లను రంగంలో దింపారు. ఆక్సిజన్ సిలిండర్ల సహాయంతో నది అడుగు భాగానికి వెళ్లాలని నిర్ణయించి రెండు రోజులుగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. గోదావరిలో నీటి మట్టం తగ్గడంతో అందుకు అవకాశమేర్పడింది. చివరకు సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బోటులో కొన్ని భాగాలు బయటకు వచ్చాయి. మంగళవారం రోజున బోటును ధర్మాడి సత్యం బృందం వెలికితీసింది. 38 రోజుల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత కాకినాడ పోర్టు అధికారి ఆదినారాయణ పర్యవేక్షణలో బోటును వెలికితీశారు. నీటి అడుగు భాగం నుంచి రోప్‌ల సాయంతో బోటుని డైవర్లు పైకి లేపారు. బోటు వెలికితీతలో ధర్మాడి సత్యం బృందం తీవ్రంగా శ్రమించింది.
ఆచూకీ లభించని వారి వివరాలు
1.కర్రి మణికంఠ, తండ్రి నరసింహారావు, పట్టిసీమ పోలవరం..
2.మధుపాడ కుశాలి, తండ్రి రమణబాబు, విశాఖపట్నం
3.మధుపాడ అఖిలేష్ (5), తండ్రి రమణబాబు, విశాఖపట్నం
4.తలారి గీతా వైష్ణవీ (5), తండ్రి అప్పలరాజు, విశాఖపట్నం,.
5.తలారి ధాత్రి (18నెలల) తండ్రి అప్పలరాజు, విశాఖపట్నం
6.బాచిరెడ్డి విఖ్యాతరెడ్డి (6), తండ్రి,మహేశ్వరరెడ్డి, నంద్యాల..
7.సంగాడి నూకరాజు (58), (బోటు డ్రైవర్) తండ్రి కామరాజు, జగన్నాధపురం, కాకినాడ
8.పోలాబత్తుల సత్యనారాయణ (50) (డ్రైవర్), తండ్రి, అప్పారావు, కాకినాడ,
9.చిట్లపల్లి గంగాధర్ (35), తండ్రి సత్యనారాయణ, నర్సాపురం..
10.కొమ్ముల రవి (40), తండ్రి శామ్యూల్, కడిపికొండ వరంగల్
11.కోడూరి రాజకుమార్(40), తండ్రి గోవర్ధన్, కడిపికొండ, వరంగల్
12.బస్కీ ధర్మరాజు, తండ్రి కొమరయ్య, వరంగల్..
13.కారుకూరి రమ్యశ్రీ (22), తండ్రి సుదర్శన్, నన్నూరు మంచిర్యాల్.
14.సురభి రవీందర్ (25), తండ్రి వెంకటేశ్వరరావు, హాలీయా నల్గొండ