టాటాలకు వాటాలను అమ్మేసిన జిఎమ్ఆర్
By Newsmeter.Network Published on 17 Jan 2020 11:37 AM ISTముఖ్యాంశాలు
- టాటాలకు 49 శాతం వాటాలను అమ్మిన జి.ఎమ్.ఆర్
- కేవలం విమానాశ్రయాలకు సంబంధించిన వాటాలు మాత్రమే
- టాటా సెయిల్ కు ఎయిర్ పోర్ట్ కంపెనీల్లో వాటాలు
- షేర్ల అమ్మకాలు కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలు పూర్తి
- రెగ్యులేటరీ అధారిటీస్ అనుమతికోసం ఎదురుచూపులు
జి.ఎం.ఆర్ కంపెనీ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ని అమ్మేస్తోంది. మొత్తంగా కాదు. కానీ 49 శాతం వాటాని. అంటే మామూలు మాటల్లో చెప్పుకుంటే సగం అన్నమాట. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఒకటైన టాటా సెయిల్, అర్బన్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ ఈ వాటాలను కొనుగోలు చేస్తోంది. ఈ విమానాశ్రయాన్ని మాత్రమే కాక అసలు మొత్తంగా ఈ వ్యాపారంలోనే సగం వాటాను జి.ఎం.ఆర్ టాటాలకు అమ్మేస్తోంది.
ఈ ఒప్పందానికి సంబంధించి జి.ఎం.ఆర్ ఇంతకు ముందే ప్రకటన చేసింది. అయితే అప్పట్లో ఆ సంస్థ చేసిన ప్రకటన సారాంశం ఏంటంటే 44.44 శాతం వాటాలను అంటే దాదాపుగా 8 వేల కోట్ల రూపాయల విలువైన వాటాలను టాటాలకు అమ్మేస్తున్నట్టు ప్రకటించడం. కానీ కంపెనీ ప్రతినిధులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ మధ్యకాలంలో వాటాల శాతాన్ని 44.44 నుంచి 49 శాతానికి పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
సాధారణంగా వ్యాపారంలో సగం వాటా ఇచ్చేవాళ్లు ఎవరైనా సరే ఒక్క షేర్ ని ఎక్కువగా తమ దగ్గర అట్టేపెట్టుకుని అంటే 51 శాతం షేర్లని తమ దగ్గర ఉంచుకుని 49 శాతం షేర్లని అమ్మేస్తారు. అంటే అవడానికి అది సగం సగం భాగస్వామ్యం అయినప్పటికీ అత్యవసరమైన పరిస్థితి ఏదైనా తలెత్తినప్పుడు ఎక్కువ ఉన్న ఆ ఒక్క షేర్ బలం ద్వారా తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి వీలవుతుంది. అంటే త యాజమాన్యపు హక్కుల్ని కాపాడుకోవడానికి వీలవుతుంది. కార్పొరేట్ వరల్డ్ లో ఇది సర్వసాధారణంగా కనిపించే విషయమే.
రెండు కంపెనీలకూ మధ్య షేర్స్ అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన అగ్రిమెంట్స్ ఇతర లావాదేవీలు జరిగాయి. కానీ ఈ ఒప్పందానికి అధికారికంగా భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెగ్యులేటరీ అధారిటీస్ నుంచి అనుమతి రావాల్సి ఉంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఫిలిప్పీన్స్ లోని మాక్టన్ సీబూ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, గోవాలో ఇంకా నిర్మాణంలో ఉన్న మోపా ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్, హెర్కిలియాన్, క్రీటీ, గ్రీస్ లో ఉన్న ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టులు అన్నింటిలోనూ ఈ ఒప్పందం ప్రకారం ఇకపై టాటా కంపెనీకి కూడా భాగస్వామ్యం ఉంటుందన్నమాట.