గీతం యూనివర్సిటీ అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు

By సుభాష్  Published on  26 Oct 2020 10:04 AM GMT
గీతం యూనివర్సిటీ అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు

విశాఖలోని గీతం యూనివర్సిటీ భూకబ్జాలపై విచారణ జరపాలని సోమవారం ప్రజా సంఘాల జేఏసీ సీబీఐకి ఫిర్యాదు చేసింది. గత 40 ఏళ్లుగా గీతం యూనివర్సిటీ భూకబ్జాలకు పాల్పడిందని, వారు ఆక్రమించిన భూముల్లో ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు చేపట్టారని, విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజు అధికంగా వసూలు చేసింది. భూకబ్జాలు, అవినీతికి పాల్పడిన గీతం యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని వారు కోరారు. రాజకీయ పలుకుబడితో యూనివర్సిటీ యాజమాన్యం తప్పించుకుంటోందని, గీతం ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని ఆయన స్వాగతించారు. యూనివర్సిటీ అక్రమాలకు చంద్రబాబు మద్దతు పలకడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రజాసంఘాల జేఏసీ సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మరో వైపు ఈ కూల్చివేతను నిరసిస్తూ యూనివర్సిటీ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు నవంబర్‌ 30 వరకు హైకోర్టు స్టే ఇచ్చింది.

కాగా, ఈనెల 24న ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మించారంటూ విశాఖపట్నం గీతం యూనివర్సిటీలోని కొన్ని కట్టడాలను జీవీఎంసీ అధికారులు తొలగించారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం, ప్రహరీగోడ కొంత భాగం సెక్యూరిటీ గదులను మున్సిపల్‌ సిబ్బంది కూల్చివేశారు. జీవీఎంసీ అధికారులు జేసీబీ, బుల్‌డోజర్లతో కూల్చివేత చేపట్టారు. ఈ కూల్చివేత సందర్భంగా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అయితే నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని గీతం యూనిర్సిటీ యాజమాన్యం ఆరోపిస్తోంది. అసలు కూల్చివేతకు గల కారణాలను కూడా చెప్పకుండా కూల్చివేశారని ఆరోపించింది. అలాగే ఈ కూల్చివేత సందర్భంగా గీతం యూనివర్సిటీకి వెళ్లే మార్గాలను అధికారులు నిలిపివేశారు.

Next Story