బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతం: సైకిల్‌పై వెళ్లిన బాలిక మృతదేహం లభ్యం
By సుభాష్ Published on 18 Sep 2020 7:56 AM GMTమేడ్చల్ జిల్లాలోని నేరెడ్‌మేట్ బాలిక మిస్సింగ్ కేసు విషాదంతమైంది. నిన్న సాయంత్రం ఇంటి నుంచి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన బాలిక సుమేధ అదృశ్యం కావడంపై మేడ్చల్ జిల్లాలో కలకలం రేపింది. నాలాలో గల్లంతైన బాలిక మృతిదేహం బండచెరువులో లభ్యమైంది. దీన్ దయాల్ కాలనీలోని నాలాలో బాలిక సైకిల్ ను గుర్తించిన సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సుమారు మూడు కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయిన బాలిక మృతదేహం.. బండచెరువులో లభ్యమైంది. కాగా, జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాలిక అదృశ్యంపై జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి ఏడు గంటలకు ఫోన్ చేస్తే ఉదయం వచ్చారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అధికారులు సమయానికి స్పందించి ఉంటే ఇంత ఘోర జరిగేది కాదని కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటన నేరెడ్‌మేట్‌లో విషాదం నింపింది.
కాగా, కాకతీయ నగర్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న సుమేధ కపురియా (12) బాలిక సైకిల్ తీసుకుని బయటకు వెళ్లింది. ఎంతసేపటికి ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీ పుటేజీల ఆధారంగా బాలిక ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిన్న నగరంలో భారీ వర్షం కురియడంతో దీన్ దయాళ్ నగర్‌లో నాళాలు పొంగిపొర్లాయని స్థానికులు పోలీసులకు వివరించారు. దీంతో పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు, రెస్క్యూ టీంలతో బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. బాలిక నాలాలో పడిపోయి ఉండవచ్చని అనుమానించిన పోలీసులు ఆ దిశగా గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక సుమేధ ఆచూకీ కోసం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బంది సైతం రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి బాలిక శవమై కనిపించడంతో బాలిక కుటుంబం విషాదంలో మునిగిపోయింది.