సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన బాలిక అదృశ్యం.. గాలిస్తున్న డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బంది
By సుభాష్ Published on 18 Sept 2020 12:25 PM ISTసైకిల్ తొక్కుకుంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ బాలిక అదృశ్యం కావడంపై మేడ్చల్ జిల్లాలో కలకలం రేపుతోంది. నేరెడ్‌మేట్ కాకతీయ నగర్‌లో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కాకతీయ నగర్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న సుమేధ కపురియా (12) అనే బాలిక సైకిల్ తీసుకుని బయటకు వెళ్లింది. ఎంతసేపటికి ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీ పుటేజీల ఆధారంగా బాలిక ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
బాలిక సీసీ పుటేజీ
అయితే నిన్న నగరంలో భారీ వర్షం కురియడంతో దీన్ దయాళ్ నగర్‌లో నాళాలు పొంగిపొర్లాయని స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు, రెస్క్యూ టీంలతో బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. బాలిక నాలాలో పడిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలిక సుమేధ ఆచూకీ కోసం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బంది గాలిస్తున్నారు. బాలిక ఖైరాలీ పబ్లిక్ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్నట్లు తెలిసింది. సైకిల్ తొక్కుకుంటూ ఇంటి నుంచి వెళ్లిన బాలిక అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.