యాభై ఏళ్ల అందమైన వరుడు కావాలి.. మా అమ్మకోసం!

By Medi Samrat  Published on  1 Nov 2019 10:25 AM GMT
యాభై ఏళ్ల అందమైన వరుడు కావాలి.. మా అమ్మకోసం!

సాధారణంగా ఎదిగిన‌ పిల్లలకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం పరిపాటి. అయితే 'ఆస్తా వర్మ' అనే యువతి మాత్రం ఇందుకు భిన్నంగా తన తల్లి కోసం వరుడి అన్వేషణ మొదలుపెట్టింది. తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే.. తన తల్లి మరోసారి ఒంటరి అయిపోతుందని భావించి.. ఆమెకు తోడును వెతికేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు సోషల్‌ మీడియాను వేదికగా ఎంచుకుంది.

‘యాభై ఏళ్ల అందమైన వరుడు కావాలి. మా అమ్మకోసం! అతడు వెజిటేరియన్‌ అయి ఉండాలి. తాగుడు అలవాటు ఉండకూడదు. అంతేకాదు జీవితంలో స్థిరపడినవాడు అయి ఉండాలి’ కూడా అంటూ ఆస్తా చేసిన ట్వీట్‌ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. తన తల్లితో పాటు కలిసి ఉన్న సెల్ఫీని కూడా ట్విటర్‌లో షేర్‌ చేయగా... నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.

‘ఎంతో గొప్ప కూతురువి. తల్లీకూతుళ్లు ఇద్దరూ స్నేహితుల్లా ఉన్నారు. ప్రతీ ఒక్క వ్యక్తికి తోడు అవసరం. అందుకు వయస్సుతో సంబంధం లేదు. అమ్మ గురించి నువ్వు ఆలోచించిన తీరు అభినందనీయం’ అంటూ పలువురు ఆమెను ప్రశంసిస్తున్నారు. అదే విధంగా తమకు తెలిసిన బ్యాచిలర్స్‌ వివరాలు కూడా అందజేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు డివోర్సీల పేర్లు ప్రతిపాదించగా.. మరికొంత మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ అంటూ తమ బంధువుల వివరాలను ఆస్తాకు పంపిస్తున్నారు. అయితే వారిలో ఆస్తా ఇంతవరకు ఎవరినీ కూడా ఎంపిక చేయలేదు. తనకు మాత్రమే కాదు తన తల్లికి కూడా పూర్తిగా నచ్చి.. సదరు వ్యక్తితో పర్సనల్‌గా మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేసింది.Next Story