ఉచిత ఇసుక విధానం తీసుకురావాలి.. గుంటూరు నిరసన దీక్షలో లోకేష్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Oct 2019 6:42 PM IST
ఉచిత ఇసుక విధానం తీసుకురావాలి.. గుంటూరు నిరసన దీక్షలో లోకేష్‌

గుంటూరు: ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటా అన్న వైఎస్‌ జగన్‌.. ఐదు నెలల్లో రాష్ట్రాన్ని ముంచే సీఎం అయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులకు తిండి లేకుండా చేసి వైసీపీ నేతలు ఇసుక తింటున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో ట్రాక్టర్‌ ఇసుక రూ. 1400 నుంచి రూ.1800 ఉంటే వైసీపీ నేతలు అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు సీఎం జగన్‌ రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ట్రాక్టర్‌ ఇసుక రూ. 4 వేల నుంచి రూ.6 వేలు అమ్ముతున్నారని ప్రభుత్వంపై నారా లోకేష్‌ మండిపడ్డారు. ప్రపంచంలో ఇసుకని కేజీల్లో అమ్ముతున్న ఏకైక రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మాత్రమేనన్నారు. ఇసుక కోసం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ ఒక మాయ, అందులో సామాన్యులకు ఎప్పుడూ నో స్టాక్‌ అనే వస్తుందని లోకేష్‌ ఆరోపించారు.

వరదల వల్ల ఇసుక కొరత ఏర్పడిందని మంత్రులు అంటున్నారు. రాష్ట్రంలో దొరకని ఇసుక బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ ఎలా వెళ్తోందని లోకేష్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికులకు ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని.. వారికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తానన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి అని సీఎం అంటున్నారు. రాజధాని సాక్షిగా ఒక ఎమ్మెల్యే, ఎంపీ వీధి రౌడీల్లా కొట్టుకున్నారు.. ఆ పంచాయతీ సీఎం తీర్చారు. ఈ విషయం గుర్తులేకపోతే గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ఒక్క గుంటూరులోనే ఐదుగురు కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. వెంటనే ఉచిత ఇసుక విధానం తీసుకురావాలని టీడీపీ నేత నారా లోకేష్‌ డిమాండ్‌ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు.

Next Story