ఆమె ప్రేమ విమానమంత..

By అంజి  Published on  28 Jan 2020 3:06 AM GMT
ఆమె ప్రేమ విమానమంత..

ఆ అమ్మాయి చూడ చక్కగా ఉంటుంది. కొంతకాలంగా పెళ్లి అంటే మాత్రం పెద్దగా శ్రద్ధ చూపించడంలేదు. బాగా ఆలోచించిన తల్లిదండ్రులు ఎవర్నన్నా ప్రేమిస్తుందేమో అని అడిగారు. అవునన్న అమ్మాయి 6 సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్నానని కూడా చెప్పింది. పోనిలే పెళ్ళికి మేం ఒకే చెప్పేస్తాం ఒకసారి పిల్లాడిని చూపించు అన్న తల్లిదండ్రులు అమ్మాయి వారిని ఎయిర్పోర్ట్ కు తీసుకువెళుతుంటే అల్లుడు బాగా బిజీ, క్షణం తీరికలేక తమని ఎయిర్పోర్ట్ లో కలుస్తున్నాడు అనుకున్నారు. కానీ కూతురు చూపించిన వ్యక్తిని చూసి షాక్ అయిపోయారు. ఎందుకంటే అది వ్యక్తి కాదు విమానం.. ఇప్పుడు మీరు షాక్ అయిపోలేదు కదా.. మీరు కాస్త సిద్ధం అయితే ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

ప్రేమలు వివిధ రకాలు అంటారు. పిచ్చి కూడా చాలా రకాలు.. అది వేరే విషయం అనుకోండి. తాజాగా జర్మనీలో జరిగిన ఓ ఘటన మాత్రం ఓ రకమైన ప్రేమకు నాంది పలికింది. అదే విమాన ప్రేమ. అంటే.. విమానాన్ని ప్రేమించడం. బెర్లిన్‌కు మిషెల్ ఆరేళ్ల క్రితం తొలిసారిగా బోయింగ్ 737-800 విమానాన్ని చూసింది. ఇక్కడి నుంచీ ఆ విమానం ఆమె మనసంతా నిండిపోయింది. ఎయిర్ పోర్ట్ అద్దాల్లోంచి విమానాన్ని చూస్తూ మిషెల్ మురిసిపోయేది. ఆరేళ్లుగా ఇలా విమానాన్ని డేటింగ్ చేస్తున్న ఆమె.. ఇక తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది.

తన కోరికను స్నేహితులు, కుటుంబం ముందుంచింది. ముందు కాస్త ఆలోచించినా తరువాత వారందరూ మిషెల్ ప్రేమను అర్ధం చేసుకున్నారు. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మార్చ్ నెలలో మిషెల్ తన ప్రియుడితో ఒక్కటి కానుంది. విమానాన్ని నిలిపి ఉంచే హ్యంగర్‌లో వీరి పెళ్లి వేడుక జరుగనుంది. అయితే ఈ పెళ్లికి తాను సాంప్రదాయ బద్ధంగా వేసుకునే తెల్లటి దుస్తులకు బదులు, ఎయిర్ హోస్టస్ యూనిఫాంలో తయారై వస్తానని మిషెల్ చెబుతోంది. అయితే డాక్టర్లు మాత్రం ఆబ్జెక్టోఫీలియా అనే మానసిక సమస్యను మిషెల్ ఎదుర్కుంటోందని చెబుతున్నారు. ఈ స్థితిలో ఉన్న వ్యక్తులకు కొన్ని వస్తువులను చూస్తే శృంగారపరమైన భావనలు కలుగుతాయని వారంటున్నారు. ప్రస్తుతం సేల్స్ ఉమన్‌గా పనిచేస్తున్న మిషెల్.. భవిష్యత్తులో విమానాల మెకానిక్ కావడమే తన ఆశయమని చెబుతోంది. ఏంటోమరి ఎవరి పిచ్చి.. కాదు కాదు ఎవరి ప్రేమ వారికి ఆనందం.

Next Story