'జార్జి రెడ్డి' రివ్యూ: పూర్తి ప్రయత్నం, పాక్షిక సాఫల్యం..!
By Newsmeter.Network Published on 22 Nov 2019 11:30 AM ISTముఖ్యాంశాలు
- కొంత సర్దుబాటుతోనే 'జార్జి రెడ్డి'ని తెరకెక్కించిన డైరక్టర్
- ఆధిపత్యపు భావజాలంపై పోరాటమే 'జార్జి రెడ్డి'
- జార్జి రెడ్డి ఎలా విప్లవించాడో చూపించిన చిత్రం
- హింస పరిష్కారం కాదని తనదైన శైలిలో చెప్పిన దర్శకుడు
- మాటలను తూటాల్లా పేల్చడంలో దర్శకుడుపాక్షిక విజయం
- జార్జి రెడ్డిని తెర ఎక్కించడం మంచి ప్రయత్నం
దురహంకారపూరిత జాతీయవాదం, పోస్ట్ ట్రూత్ పాలిటిక్స్ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఒక విస్మృత విప్లవకారుడి జీవితాన్ని తెరకెక్కించడం నిజంగా దుస్సాహసమే. సెన్సార్ కోతలు, దక్షిణ పక్ష కార్పణ్యాలు, నిషేధ భీతి వంటి అడ్డంకులన్నిటినీ దాటేందుకు దర్శకుడు కొంత సర్దుబాట్లు చేయక తప్పలేదు. మత దురహంకారంపై, అగ్రవర్ణ ఆధిపత్య భావజాలంపై, క్యాంపస్ గూండాయిజం, అత్యాచారాల పర్వం పై జార్జి రెడ్డి చేసిన పోరాటపు తీవ్రతను తగ్గించేందుకు దర్శకుడు చాలా ప్రయత్నమే చేశాడని చెప్పాలి.
అయితే ..ప్రస్తుత రాజకీయ నిర్బంధాల పరిధుల్లో ఉంటూనే జార్జి పాత్రకు జీవం పోయించాడు దర్శకుడు. చనిపోయిన నాలుగున్నర దశాబ్దాల తరువాత కూడా అణచివేతపై మన చేగువేరా, మన విప్లవ వేగుచుక్క జార్జి రెడ్డి ఎలా విప్లవించాడో ఈ చిత్రం చూపిస్తుంది.
జార్జి ద్వారా హింసను హింసతో ఎదుర్కోవాలని అతని చరిత్రాత్మక తుది ప్రసంగంలో చెప్పించినా, క్లైమాక్స్ లో తుపాకీని ప్రవహిస్తున్న నీటిలోకి విసిరేయించడం ద్వారా దర్శకుడు తాను వామపక్ష హింసావాదాన్ని సమర్ధించడం లేదని చెప్పక చెప్పాడు. తాను హింసా మార్గాన్ని అవలంబించినా జార్జి ఏనాడూ తుపాకీ పట్టలేదన్న విషయాన్నీ సినిమా చెబుతుంది.
నిజానికి మన దేశం ఒక అహింసా ప్రజాస్వామ్యంగా రూపు దిద్దుకుంది. అదే విషయాన్ని సినిమా చెబుతుంది. హింసకు తావు లేకుండా కూడా జార్జి రెడ్డి మార్గంలో న్యాయం కోసం పోరాడవచ్చునని సినిమా క్లైమాక్స్ చెబుతుంది. అయితే స్వేచ్ఛ కోసం, సత్యం కోసం హింసా మార్గం, అహింసా మార్గాల్లో ఏ మార్గం ఎంచుకుని పోరాడినా, అన్యాయాలను ప్రశ్నించినా అణచివేత, అరెస్టు, హత్య, నిషేధాలే సమాధానమన్న విషయాన్ని జార్జి హత్య తెలియచెప్పుతుంది. గాంధీ, అయినా, జీసస్ అయినా, జార్జి అయినా, అసాంజె అయినా, షోయబుల్లా ఖాన్ అయినా లేక భగత్ సింగ్ అయినా ఇదే జరిగిందన్న సంగతిని గుర్తుంచుకోవాలి.
భావజాలాన్ని, సిద్ధాంతాన్ని దర్శకుడు ఇంకా బాగా చెప్పాల్సి ఉంది. మాటే తూటా అనే విషయాన్ని దర్శకుడు మరిచిపోయినట్లు ఉన్నాడు. జార్జి రెడ్డి పాత్రధారి మాటలను తూటాల్లా పేల్చడంలో ఆశించినంత చేయలేదు. మాటలు కొడవలి వలే పదును ఎక్కాల్సి ఉంది.సినిమాను నేటి తరానికి అర్ధమయ్యేలా చెప్పడంలో దర్శకుడు విజయం సాధించాడనే చెప్పాలి.
జార్జి రెడ్డి చిత్రం అటు బయోపిక్ కాదు. ఇటు కమర్షియల్ సినిమా కాదు. దర్శకుడు జార్జి రెడ్డి ని ఒక హీరోగా చూపించడంలో, ప్రగతిశీలవాదుల గుండెల్లో ప్రతిష్ఠించడంలో పాక్షికంగానే దర్శకుడు సఫలుడయ్యాడని చెప్పాలి. అయితే సినిమా ఓ సారి చూసేయవచ్చునన్నదీ అంతే సత్యం. జార్జి రెడ్డి సినిమాను చూడొచ్చు..ఆనాటి పరిస్థితులపై అవగాహన వస్తుంది. జార్జిరెడ్డి తాపత్రయం తెలుస్తోంది.