ఒక బౌల‌ర్‌కు అంత అవ‌స‌రం లేదు.. అత‌నికి బ‌దులు..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Dec 2019 7:51 AM GMT
ఒక బౌల‌ర్‌కు అంత అవ‌స‌రం లేదు.. అత‌నికి బ‌దులు..

గురువారం ఐపీఎల్ వేలం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆ వేలంలో పేస్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు అధిక ధ‌ర వెచ్చించి మ‌రీ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే కేకేఆర్ యాజ‌మాన్యం తీసుకున్న ఈ నిర్ణయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ తప్పుబట్టాడు. వేలంలో ఆసీస్‌ పేస్‌ బౌలర్‌ కమిన్స్‌ను రూ. 15 కోట్ల 50 లక్షలకు కేకేఆర్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. త‌ద్వారా ఒక విదేశీ ఆటగాడికి ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక మొత్తం అందుకున్న ఆటగాడిగా కమిన్స్‌ రికార్డుకెక్కాడు.

ఈ విష‌య‌మై.. ఒక‌ బౌలర్‌ కోసం ఇంత పెద్ద మొత్తంలో చెల్లించడం సరికాదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఓ బౌలర్ కోసం అత్యధిక ధర చెల్లించి బ్యాకప్‌ బ్యాట్స్‌మెన్‌ లేకుండా చేసుకున్నారని కేకేఆర్ తీరును విమర్శించాడు. అయితే.. కొత్త బంతితో ప్యాట్‌ కమిన్స్‌ అద్భుతంగా రాణించగలడని.. అతడికి మంచి బౌలింగ్‌ నైపుణ్యాలు ఉన్నాయని అన్నాడు. ఒక‌ప్పటితో పోలిస్తే తన ఆటతీరు ఎంతో మెరుగుపడిందని అన్నారు. భారీ మొత్తంలో డబ్బు చెల్లించి కొనుక్కున్నారు కాబట్టి ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు మంచి ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నాడు. అంతేకాదు క‌మ్మిన్స్ క‌నీసం 3-4 మ్యాచులైనా ఒంటిచేత్తో గెలిపించాలని అన్నాడు.

ఇక కోల్‌క‌తా బ్యాట్స్‌మెన్‌లు అయిన‌ ఇయాన్‌ మోర్గాన్‌, ఆండ్రీ రసెల్‌ గాయపడితే పరిస్థితి ఏంటి..? వారికి బ్యాకప్ బ్యాట్స్‌మెన్ కూడా జట్టులో లేరని గుర్తుచేశారు. కమిన్స్‌ గాయపడితే అతడి స్థానంలో ఫెర్గూసన్‌ ఉంటాడు. కానీ టాప్‌ ఆర్డర్‌లో మాత్రం ఎవరు గాయపడినా వారి స్థానాన్ని భర్తీ చేసేవారు జట్టులో లేరని అన్నాడు. అందుకే కేకేఆర్ వేలంలో.. మిచెల్‌ మార్ష్‌ను గానీ, మార్కస్ స్టోయినిస్‌ను గానీ తీసుకుని ఉంటే బాగుండేదని గంభీర్‌ అభిప్రాయం వ్య‌క్తం చేశాడు..

కేకేఆర్‌కు 2011 నుంచి ఏడు సీజన్ల పాటు గంభీర్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2012, 2014 సీజ‌న్‌ల‌లో జట్టును విజేతగా నిలిపాడు. అనంతరం గ‌త సీజ‌న్‌లో ఢిల్లీకి క్యాపిట‌ల్స్ కు ప్రాతినిథ్యం వ‌హించాడు. గ‌త సీజ‌న్‌లోనే జట్టుకు విజయాలు అందించలేకపోతున్నాన‌నే కారణంతో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

Next Story