కరోనా కట్టడికి.. గంభీర్‌ సాయం రూ.50లక్షలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 March 2020 8:56 AM GMT
కరోనా కట్టడికి.. గంభీర్‌ సాయం రూ.50లక్షలు

దేశంలో కరోనా వైరస్‌(కొవిడ్‌-19) కట్టడికి భారత మాజీ క్రికెటర్‌, ఎంపీ గౌతం గంభీర్‌ తన వంతు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చాడు. భారత్‌లో ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య 400కి చేరుకోగా.. 9మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికే అప్రమత్తమైన చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. కరోనా బాధితులకు అండగా నిలి చేందుకు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.

తూర్పు ఢిల్లీ నియోజకవర్గ ఎంపీగా ఉన్న గంభీర్‌ తన ఎంపీల్యాడ్‌ నిధుల నుంచి రూ.50లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అవసరమైన పరికరాల కోసం ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు లేఖ రాశాడు. సంబంధిత అధికారి తన ఆఫీస్‌కి వచ్చి చెక్‌ కలెక్టు చేసుకోవాలని గంభీర్‌ ఆ లేఖలో పేర్కొన్నాడు.

Next Story