భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. రూ.225 పెంపు
By సుభాష్ Published on 2 Feb 2020 9:57 AM GMT
ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో జనాలు సతమతమవుతుంటే..ఇప్పుడు మరో షాక్ తగిలినట్లయింది. తాజాగా మరోసారి వంట గ్యాస్ ధరలు పెరిగాయి. కాకపోతే పెరిగిన ధరలు అందరికి వర్తించవు. కేవలం హోటల్స్ లాంటి కమర్షియల్ అవసరాలకు వాడే 19 కిలోల సిలిండర్ ధర మాత్రమే పెరిగింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 225 వరకు పరుగులు పెట్టింది. తాజాగా పెరిగిన ధరతో రూ.1,550కి చేరుకుంది. ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు ప్రజలకు గ్యాస్ షాక్ తగులుతూనే వస్తోంది. ప్రస్తుతం ఫిబ్రవరి మొదట్లోనే గ్యాస్ సిలిండర్ ధర భారీగానే పెరిగింది. పెరిగిన ఎల్పీజీ ధరలు ఈరోజు నుంచే అమల్లోకి రానున్నాయి.
రిటైల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఉపయోగించే వారికి కొంత మేరకు ఊరట లభించిందనే చెప్పాలి. ఇక గత ఐదు నెలలుగా పెరుగుతూ వచ్చిన గృహ అవసరాలకు వాడే సిలిండర్ ధర మాత్రం ప్రస్తుతానికి యధాతధంగానే ఉంది. దేశంలో జనవరి నెల వరకు ఇదే ట్రెండ్ కొనసాగింది. అక్టోబర్‌లో ఎల్పీజీ సిలిండర్ ధ రూ.15 వరకు పెరిగింది. సెప్టెంబర్‌లో రూ. 15.5 వరకు, నవంబర్‌లో ఏకంగా రూ. 75, డిసెంబర్‌లో రూ.14, జనవరిలో రూ. 19 వరకు పెరిగి నిలకడగా ఉంది. ఇక వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకునే కమర్షియల్ సిలిండర్ ధర పెంపుతో ట్రేడర్లకు ఇబ్బందులు తప్పవనే చెప్పాలి.