గంటాశ్రీనివాసరావు పార్టీ మారుతారని ఎన్నికల ముందు నుంచి న్యూస్‌ వైరల్‌ అవుతోంది. వైసీపీలోకి వెళతారని కొన్నాళ్లు…బీజేపీ వైపు చూస్తున్నారని మరికొన్నాళ్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన కండువా మార్పిడికి ముహూర్తం ఖరారైందట.

గంటా శ్రీనివాసరావుకు బీజేపీలోకి జంప్‌ కావడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన రాంమాధవ్‌తో చర్చలు జరిపారు. కొన్ని షరతులు పెట్టారని తెలుస్తోంది. దీంతో ఆ షరతులపై క్లారిటీ రాగానే ఆయన్‌ జంప్‌ అవుతారని సమాచారం.

ఈవారంలో క్లియరెన్స్‌ రాగానే వచ్చే వారం ఆయన పార్టీ మారుతారని తెలుస్తోంది. 2014 ఎన్నికల తర్వాత గంటా టీడీపీలో కీలకనేతగా మారారు. ఎన్నికల తర్వాత నుంచి గంటా పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఎప్పుడూ ఈ వార్తలు ఖండించలేదు. ఢిల్లీలో సైలెంట్‌గా ఇప్పటికే మంతనాలు పూర్తి చేశారని తెలుస్తోంది.

విశాఖలో పవన్‌ లాంగ్‌మార్చ్‌కు టీడీపీ తరపున గంటా హాజరుకావాలి. అక్కడ కనిపించలేదు. ఇటు విజయవాడలో జరిగే పార్టీ మీటింగ్‌లకు రావడం లేదు. దీంతో గంటా జంప్‌ గురించి ఆరా తీస్తే అసలు విషయం తెలిసిందట.

గంటా ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం తర్వాత మంత్రి అయ్యారు. 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో విశాఖ నార్త్‌ నుంచి పోటీ చేసిన గంటా ఓడిపోతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ స్వల్ప మెజార్టీతో ఆయన గెలిచారు. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో….గంటా పార్టీ మారుతారని ఆరునెలల నుంచి ఊహగానాలు విన్పిస్తున్నాయి. ఓ సారి ఆయన వైసీపీలో చేరుతారని.. మరోసారి బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అయితే గంటా మాత్రం తన మనసులో మాటను బయటపెట్టలేదు.

విశాఖలో బీజేపీలో బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని గంటా హామీ ఇచ్చారట. అంతేకాదు తనతో పాటు పది నుంచి 11 మంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకువస్తానని చెప్పారట. ఇప్పుడు గంటతో పాటు వెళ్లే ఆ ఎమ్మెల్యేలు ఎవరు అనే చర్చ నడుస్తోంది.

విశాఖలో గంటాతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతారని తెలుస్తోంది. వెలగపూడి రామకృష్ణ మాత్రం టీడీపీలోనే ఉండే చాన్స్‌ ఉంది. ఈ మధ్య ఆయన టీడీపీ తరపున యాక్టివ్‌గా ఉంటున్నారు. గంటా జంప్‌తో విశాఖలో టీడీపీకి భారీ ఝలక్ తగిలే అవకాశం కన్పిస్తోంది.

– శ్రీధర్, సీనియర్ జర్నలిస్ట్

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.