ముఖ్యాంశాలు

  • ఏపీలో పొలిటికల్ హీట్ పుట్టించిన గన్నవరం పంచాయితీ
  • యార్లగడ్డ వెంకట్రావ్ ను పిలిపించుకుని మాట్లాడిన సీఎం జగన్
  • వెంకట్రావ్ రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన సీఎం జగన్
  • యార్లగడ్డ, వంశీ మధ్య సయోధ్య కుదిరేనా?
  • గన్నవరంలో యార్లగడ్డ, వంశీ కలిసి పని చేస్తారా?

15 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో గన్నవరం పంచాయితీ పొలిటికల్ హీట్ పుట్టించింది. గన్నవరం పంచాయితీలో డైరక్ట్‌గా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా కల్పించుకున్నారు. వైఎస్ఆర్ సీపీలోకి వంశీ రాకను యార్లగడ్డ వెంకట్రావ్‌ , ఆయన వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. యార్లగడ్డ వెంకట్రావ్ వర్గీయులు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు కూడా చేశారు. దీంతో ..వైఎస్ జగన్ స్వయంగా రంగంలోకి దిగారు. మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో కలిసి యార్లగడ్డ వెంకట్రావ్ జగన్‌ను కలిశారు. వంశీ పార్టీలోకి రావడం వలన రాజకీయంగా మీ భవిష్యత్తుకు నష్టం ఏం ఉండదని వెంకట్రావ్‌కు జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. వెంకట్రావ్‌కు రాజకీయ భవిష్యత్తపై జగన్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. దీంతో ..యార్లగడ్డ వెంకట్రావ్ మెత్తబడినట్లు తెలుస్తోంది.సీఎం వైఎస్ జగన్ తో సమావేశం తరువాత పేర్ని నాని, కొడాలి నాని, యార్లగడ్డ వెంకట్రావ్ ఒకే కారులో వెళ్లారు. గన్నవరం పంచాయితీకి తెరపడటంతో గన్నవరం వైఎస్ఆర్ సీపీ శ్రేణులతోపాటు, కృష్ణా జిల్లా నేతలూ ఊపిరి పీల్చుకున్నారు.

అయితే..యార్లగడ్డ వెంకట్రావ్, వంశీ సర్దుకుపోవడం అంత ఈజీకాదు. ఎందుకంటే…గతంలో కూడా కావాలనే తనపై ఫిర్యాదు చేయించి కేసులు పెట్టించారని వెంకట్రావ్‌పై వంశీ ఆరోపణలు చేశారు. ఇళ్ల పట్టాల ఫోర్జరీ చేశారంటూ రవి కుమార్‌ అనే వైఎస్ఆర్ సీపీ సానుభూతి పరుడి చేత యార్లగడ్డ వెంకట్రావ్ ఫిర్యాదు చేయించారని వంశీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో కుట్ర కోణం ఉందని గతంలోనే వంశీ ఆరోపణలు సంధించారు. తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని..ఆధారాలను గవర్నర్‌, హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి అందజేస్తామనని వంశీ గతంలోనే ప్రకటించారు. ఇంతగా ఇద్దరీ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల మధ్య ఇద్దరూ ఉప్పునిప్పులానే ఉండే అవకాశముంది. రాజకీయంగా సర్దుబాటు ముఖ్యమని వైఎస్ఆర్‌ సీపీ నేతలు కూడా నేతలు భావిస్తున్నారు.

గన్నవరంలో వైఎస్ఆర్ సీపీ ఇంటర్నల్ వ్యవహారం ఇలా ఉంటే…గన్నవరం పంచాయితీ టీడీపీలో కూడా హీట్ పుట్టించిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు ఒక్కసారిగా వంశీపై మాటల దాడి పెంచారు. ఓ ఛానల్ లో టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. బూతులు తిట్టుకునే స్థాయికి నేతలు వెళ్లారు. అయితే..వంశీ మాత్రం తనదారి జగన్ దారే నని కుండబద్దలు కొట్టారు. లోకేష్, దేవినేని ఉమా అరాచకాలు తట్టుకోలేకే టీడీపీని వీడుతున్నట్లు వంశీ ప్రకటించారు. లోకేష్‌తో టీడీపీకి భవిష్యత్తులో మంచి జరగదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు చుట్టూ ఉన్న ఓ కోటరీని టీడీపీని ముంచేస్తుందని వంశీ అభిప్రాయపడ్డారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.