ముఖ్యాంశాలు

  • గంగూలీ అంటే కోహ్లీ మనసులో భయం ఉందా?
  • గంగూలీతో గొడవలు ఎందుకుని కోహ్లీ అనుకుంటున్నాడా?

ఆట మొదలైంది. గంగూలీ ఎక్కడుంటే అక్కడే ఆట. అది గ్రౌండ్‌లోనైనా బయటైనా. ఒక ఆటగాడు బీసీసీఐ అధ్యక్షుడు అయితే ఎలా ఉంటుంది..రాజకీయ నేతలు ఆ సీట్లో కూర్చుంటే తేడా ఎలా ఉంటుందో గంగూలీ వచ్చిన వారం రోజులకే తేడా స్పష్టంగా కనిపించింది. గంగూలీ అంటే భయమో?..భక్తో తెలియదు . రవి శాస్త్రి – కోహ్లీ ధ్వయానికి మాత్రం చెమటలు పడుతున్నాయనే చెప్పొచ్చు. గంగూలీ బెంగాలీ తెలివితేటలకు..ఢిల్లీ ఠాకూర్ తలవంచక తప్పలేదు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కాగానే మీడియాలో పలు కథనాలు వచ్చాయి. గంగూలీ – కోహ్లీ ఫస్ట్ మీటింగ్ ఎలా ఉంటుందో అని కూడా ఆర్టికల్స్‌ రాశారు. కాని..వారు రాసినంత లోతుగా, అభిమానులు చదివినంత ఇంట్రస్ట్‌గా అక్కడేమీ కాలేదు. ఎందుకంటే..గంగూలీకి తెలుసు “ఆట ఎలా ఆడాలో..ఆడించాలో”.

టీమిండియా ఎప్పటి నుంచో ఓ విషయంలో మెలిక పెడుతుంది. టీమిండియా మెలిక పెడుతుంది అనే కంటే..కోహ్లీ పెడుతున్నాడనే చెప్పాలి. అదే..డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లకు కోహ్లీ ససేమిరా అంటున్నాడు. బీసీసీఐ పెద్దలు కూడా కోహ్లీని ఒప్పించలేక పోయారు. అలాగే..పింక్ బాల్ విషయంలో కూడా కోహ్లీ తన వాదనకే కట్టుబడి ఉన్నారు. కాని..గంగూలీ వచ్చాడు..సీన్ మారిపోయింది. టీమిండియాను నడిపే విధానంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలున్నాయి. ఇది జగమెరిన సత్యం.

గంగూలీ – కోహ్లీ మధ్య భేటీ ఓ గంట పాటు జరిగి ఉంటుందేమో..!. దానిలో 3 సెకన్లు అత్యంత కీలకం. ఆ మూడు సెకన్లలోనే కోహ్లీని గంగూలీ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లకు ఒప్పించాడు. గంగూలీ అడగ్గానే..ముందుకు పోదాం అంటూ గంగూలీ ఒప్పుకున్నాడని స్వయంగా గంగూలీనే చెప్పాడు. గంగూలీ మాట వినకపోతే కష్టాలుంటాయని కోహ్లీ అంచనాకు వచ్చాడా..?.లేకపోతే..పగలు టెస్ట్ మ్యాచ్‌లు చూడటానికి అభిమానులు రారనే వాస్తవాన్ని కోహ్లీ ఆకలింపు చేసుకున్నాడా..? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది కోహ్లీనే. మొత్తానికి కోహ్లీ చేత మూడు సెకన్లలో ఒప్పించడం గంగూలీ నాయకత్వ పటిమకు నిదర్శనం.

కోహ్లీ వెంటనే ఒప్పుకోవడం వెనుక 4 కారణాలు ఉండి ఉంటాయి. 1. బీసీసీఐతో అంటే గంగూలీతో గొడవలు ఎందుకని అనుకోవడం. 2.గంగూలీతో సఖ్యతగా ఉంటే మొదట లాభపడేది తనేనని కోహ్లీకి తెలుసు. 3. తాను గంగూలీతో సఖ్యతగా ఉండటం వలన కోచ్‌ రవి శాస్త్రికి ఇబ్బందులు ఉండవు. 4.గంగూలీ అండ ఉంటే జట్టు కూర్పులో తన మాట చెల్లుబాటు అవుతుందని, లేదంటే గంగూలీ మాటే చెల్లుబాటు అవుతుందని కోహ్లీ నమ్మడం.

మొత్తానికి..ఇద్దరూ దూకుడుగాళ్లే. జవసత్వాలులేక కొట్టుమిట్టాడుతున్న టీమిండియాకు గెలుపు రుచి ఎలా ఉంటుందో నేర్పిన వాడు గంగూలీ. ఆ దూకుడిని మరింత దూకుడిగా ముందుకుతీసుకెళ్తున్నవాడు కోహ్లీ. ఇద్దరూ కలిసి భారత క్రికెట్‌కు విజయాల బాట వేస్తారని ఆశిద్దాం.

  • వై.వి.రెడ్డి, న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.