గాంధీలో ఒక రోజు.. డాక్టర్ మనోగతం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Jun 2020 7:17 AM GMT
గాంధీలో ఒక రోజు.. డాక్టర్ మనోగతం

గాంధీ ఆసుపత్రిలో ఓవైపు తాము ఎన్నో కష్ట నష్టాలు అనుభవిస్తూ డ్యూటీలు చేస్తుంటే.. తమ మీద పేషెంట్ల బంధువులు దాడులు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహానికి గురై రోడ్డెక్కారు వైద్యులు. ఈ సందర్భంగా గాంధీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వెల్లడైంది. వైద్యులకు, పేషెంట్లకు సరైన సదుపాయాలు కరవయ్యాయి. భద్రత ఏర్పాట్లు సరిగా లేవు. ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్యులకు సౌకర్యాలు కరవు. వారికి అసలు కరోనా పరీక్షలు లేవు. దీనికి తోడు పేషెంట్లకు ఏమైనా అయితే వారి బంధువులు వైద్యులపై దాడి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే వైద్యులకు పట్టరాని కోపం వచ్చింది. ఈ సందర్భంగా వివిధ రూపాల్లో వాళ్లు తమ అసహనాన్ని బయటపెడుతున్నారు. తాజాగా గాంధీలో పని చేసే భవేష్ జైన్ అనే ఓ వైద్యుడు.. కరోనా నేపథ్యంలో తమ రోజు ఎలా గడుస్తుందో వివరిస్తూ పెట్టిన సోషల్ మీడియా పోస్టు వైరల్ అవుతోంది. అందులో ఆయనేమన్నారో సంక్షిప్తంగా..

ఉదయం ఇంట్లో తమను తాము ఐసోలేట్ చేసుకున్న గదిలో నిద్ర లేచి హడావుడిగా తయారై గాంధీకి చేరుకోవడంతో 12 గంటల డ్యూటీ మొదలవుతుంది. ముందుగా అక్కడ పీపీఈ కిట్ ధరించాలి. దాన్ని వేసుకుంటే ఒక రైస్ బ్యాగ్ మోస్తున్నంత బరువుగా అనిపిస్తుంది. కొన్ని నిమిషాలకే చెమట పట్టడం మొదలవుతుంది. వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతల ధాటికి కాసేపటికే దాన్ని భరించలేని పరిస్థితి వస్తుంది. అయినా అలాగే వెళ్లి పేషెంట్ల వార్డుల్లో రౌడ్స్ వేయాల్సి ఉంటుంది. వంద మంది ఉండే వార్డులోకి వెళ్లి పేషెంట్ల ఆక్సిజన్ స్థాయి, బీపీ, షుగర్ లెవెల్స్ పరీక్ష జరపాలి. ఈ వివరాలు తీసుకునేటపుడు కరోనా ఉందని తెలిసి కూడా వారిని ముట్టుకోవాల్సి ఉంటుంది.

ఒక వార్డులో ఈ పని పూర్తి చేయడానికి మూడు గంటలు పడుతుంది. తర్వాత పీపీఈ కిట్ తీస్తే షవర్ కింద నిలబడ్డ స్థాయిలో చెమటలు కారుతుంటాయి. తర్వాత పేషెంట్ల వైటల్స్‌ వివరాల్ని బట్టి కొత్త కంప్లైంట్స్ ఉంటే వాటికి తగ్గ ట్రీట్మెంట్ రాయాల్సి ఉంటుంది. ఇదొక 4-5 గంటల పని. పేషెంట్లలో ఏవైనా మార్పులు కనిపిస్తుంటే.. బ్లడ్ టెస్టులు, ఎక్స్‌రేలు, ఇతర ఇన్వెస్టిగేషన్స్ చేయించాలి. ఆయా రిపోర్టుల పరిశీలన కూడా పెద్ద పనే.

ఇంత కష్టపడ్డ తర్వాత ఎవరైనా పేషెంట్ కరోనా విముక్తుడై బయటికి వెళ్తుంటే.. ఒక మనిషిని ప్రమాదం నుంచి బయటపడేశామన్న సంతృప్తి. 12 గంటల పాటు ఈ విధులు ముగించుకుని ఇంటికి చేరేసరికి బాగా పొద్దుపోతుంది. ఇంటికి చేరుకునే సమయానికి మనమేమైనా కరోనాను మోసుకొచ్చామా.. కుటుంబ సభ్యులకు అంటిస్తున్నామా అన్న భయం. ఇంట్లో భార్య/భర్త, పిల్లల దగ్గరికి వెళ్లకుండా నేరుగా తమ రూపంలోకి వెళ్లి స్నానం చేయడం.. ఆ గదిలోనే ఐసోలేట్ కావడం.. ఇదీ గాంధీలో డాక్టర్ల దినచర్య.

Next Story