ఓ వైపు పశ్చాత్తాప వ్యాఖ్యలు.. మరో వైపు కుటిల ప్రయత్నాలు

By సుభాష్  Published on  26 Aug 2020 11:44 AM GMT
ఓ వైపు పశ్చాత్తాప వ్యాఖ్యలు.. మరో వైపు కుటిల ప్రయత్నాలు

భారత్‌పై అధిపత్యం కోసం చైనా కుటిల ప్రయత్నాలు చేస్తూ, సరిహద్దుల్లో సైనిక సంపత్తిని మోహరిస్తూ మరో వైపు భారత్‌పై ముసలి కన్నీరు కారుస్తోంది చైనా. భారత్‌ - చైనా సరిహద్దులో గల్వాన్‌ ఘటనలో 20 మంది సైనికులు మరణించడం దురదృష్టకర సంఘటనగా అభివర్ణించింది చైనా. ఘటన జరిగిన రెండు నెలల తర్వాత చైనా పశ్చాత్తాప వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇలాంటి ఘటనలు జరగాలని ఇరు దేశాలు కోరుకోవడం లేదని భారత్‌లోని చైనా రాయబారి సన్‌ వీడాంగ్‌ అన్నారు.

ఇండియా-చైనా యూత్‌ ఫోరం ఆగస్టు 18న నిర్వహించిన వెబినార్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు చైనా రాయబార కార్యాలయం మంగళవారం సాయంత్రం వెల్లడించింది. గల్వాన్‌ లాంటి దురదృష్టకరమైన ఘటన మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని వీడాంగ్‌ అభిప్రాయపడ్డారు.

భారత్‌ను చైనా ప్రత్యర్థిగా కాకుండా ఓ మిత్రదేశంగా, ముప్పుగా కాకుండా ఓ అవకాశంగా భావిస్తోందని పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా సరిహద్దు వివాదాలను సైతం పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. భారత్‌-చైనా మధ్య జరిగిన ఘటన తర్వాత భారత్‌ లో పెరిగిన స్వయం సమృద్ది నినాదాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. వివాదాలకు స్వస్తి పలికి అభివృద్ధి దిశగా సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చైనాకు భారత్‌ ఎప్పుడు శత్రువు కాదంటూ చెప్పుకొచ్చింది. పొరుగు దేశంతో ముప్పుకంటే స్నేహమే బెటర్‌ అంటూ తన ద్వంద వైఖరి ప్రదర్శిస్తుంది.

ఏ దేశమూ ఒంటరిగా అభివృద్ధి సాధించడం సాధ్యం కాదు

ఏ దేశమూ ఒంటరిగా అభివృద్ధి సాధించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచీకరణ యుగాంతంలో స్వయం సమృద్ధి సాధిస్తూనే ఇతరులకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యనించారు.

రెండు దేశాల మధ్య నెలకొన్నఉద్రిక్తత పరిస్థితులను మర్చిపోయి, ఒకరికి లాభం.. మరొకరికి నష్టం అన్న భావన విడిచిపెట్టాలని వీడాంగ్‌ అన్నారు. రెండు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలన్నారు. చైనా-భారత్‌ సంబంధాల అభివృద్ధిలో పూర్తి విశ్వాసం ఉండాలని వ్యాఖ్యనించారు. కరోనా మహమ్మారి కారణంగా రెండు దేశాల ప్రజల, సాంస్కృతిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని గుర్తు చేశారు. రెండు దేశాల మధ్య రెండువేల ఏళ్ల అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ దేశం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Next Story