గద్ద‌ల‌కొండ గ‌ణేష్ రివ్యూ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Sep 2019 10:55 AM GMT
గద్ద‌ల‌కొండ గ‌ణేష్ రివ్యూ..!

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వ‌రుణ్ తేజ్ - హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో రూపొందిన భారీ యాక్ష‌న్ సినిమా గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్. ఇది త‌మిళనాట ఘనవిజయం సాధించిన జిగ‌ర్తాండ చిత్రానికి రీమేక్. ముందుగా ఈ సినిమాకు వాల్మీకి అనే టైటిల్ పెట్టిన‌ప్ప‌టికీ రిలీజ్ ముందు రోజు గ‌ద్ద‌ల‌ కొండ గ‌ణేష్ గా మార్చ‌డం జ‌రిగింది. వరుణ్ తేజ్ కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తున్నాడు. ఈసారి కూడా అదే పంథాను అనుసరించాడు. ఈ నెల 20న గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి... త‌మిళంలో వ‌లే తెలుగులో కూడా విజ‌యం సాధించిందా..? లేదా..? అనేది చూద్దాం.

క‌థ - గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ (వ‌రుణ్ తేజ్) త‌న‌కు అడ్డువ‌చ్చిన వాళ్లని అంతం చేస్తుంటాడు. అభి (అథ‌ర్వ‌)కి సినిమాలంటే పిచ్చి. ఓ ద‌ర్శ‌కుడు ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా వ‌ర్క్ చేస్తాడు. అయితే... ఆ డైరెక్ట‌ర్ అభిని తిట్ట‌డంతో అవ‌మానం భ‌రించ‌లేక‌ బ‌య‌ట‌కు వ‌చ్చేసి ఏడాది తిరిగే లోపు సినిమా చేస్తాన‌ని ఆ ద‌ర్శ‌కుడితో స‌వాలు చేసి వ‌స్తాడు.

ఏ క‌థ‌తో సినిమా తీయాలి అని ఆలోచిస్తున్న‌ప్పుడు ఓ విల‌న్ క‌థ‌తో సినిమా తీయాలి అనుకుంటాడు. అంతే... నేర చ‌రిత్ర ఉన్న వాళ్ల కోసం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. పోలీసుల‌ను క‌లిసి నేర చ‌రిత్ర ఉన్న వాళ్ల గురించి తెలుసుకుంటాడు. అలా తెలుసుకునే క్ర‌మంలో గ‌ద్ద‌లకొండ గ‌ణేష్ గురించి తెలుస్తుంది. ఆరా తీస్తే గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్‌ రౌడీ షీట‌ర్ అనీ, ఆ ప్రాంతంలో అత‌నంటే హ‌డ‌ల్ అనీ, లోక‌ల్ ఎమ్మెల్యే స‌పోర్ట్ ఉంద‌నీ తెలుస్తుంది. త‌న స్నేహితుడు ద్వారా గ‌ణేష్ గురించి మొత్తం తెలుసుకుంటాడు. ఈ క్ర‌మంలో బుచ్చ‌మ్మ‌(మృణాళిని)ని ప్రేమిస్తాడు.

ఈ క్రమంలోనే గ‌ణేష్ ల‌వ్ స్టోరీ గురించి కూడా తెలుసుకుంటాడు. గ‌ణేష్ క‌థ‌తో గ‌ణేష్ నే హీరోగా పెట్టి సీటీమార్‌ అనే సినిమా చేస్తాడు. ఆ సినిమా షూటింగ్‌లో ఉండ‌గా గ‌ణేష్‌కి బుచ్చ‌మ్మ మీద మ‌న‌సు పడతాడు. అయితే అప్ప‌టికే అభితో ప్రేమ‌లో ఉన్న బుచ్చ‌మ్మ‌, అభితో వెళ్లిపోతుంది. ఈ విష‌యం తెలుసుకున్న గ‌ణేష్ ఏం చేసాడు..? అభి, బుచ్చ‌మ్మ పెళ్లి జ‌రిగిందా..? లేదా..? గ‌ణేష్ లో సినిమా తీసుకొచ్చిన మార్పు ఏంటి అనేదే మిగిలిన క‌థ‌

ప్ల‌స్ పాయింట్లు

- వ‌రుణ్ తేజ్ న‌ట‌న‌

- డైలాగులు

- సంగీతం

- ఎల్లువొచ్చి గోదార‌మ్మ పాట‌

- సెకండాఫ్

మైన‌స్ పాయింట్లు

- ఫ‌స్టాఫ్

- నిడివి ఎక్కువుగా ఉండ‌డం

విశ్లేష‌ణ‌ :

మిరపకాయ్, గబ్బర్ సింగ్ సినిమాలతో దర్శకుడిగా హరీష్ శంకర్ మాస్ పల్స్ పట్టేశాడు. దీంతో వ‌రుణ్ తేజ్ తో జిగ‌ర్తాండ రీమేక్ అన‌గానే ఫుల్ మాస్ గా ఉంటుంది అనే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు హ‌రీష్ ఈ సినిమాని తెర‌కెక్కించాడు కానీ... ఫ‌స్టాఫ్ లో సినిమా ముందుకు వెళ్ల‌దు. దీంతో ఏంటి సినిమా స్లోగా ఉందా అనే ఫీలింగ్ క‌లుగుతుంది. ఇక సెకండాఫ్ స్టార్ట్ అయిన త‌ర్వాత సినిమా స్పీడు అందుకుంటుంది. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ పాత్ర పోషించిన వ‌రుణ్ తేజ్ గురించి. ఈ పాత్ర‌ను వ‌రుణ్ తేజ్ అద్భుతంగా పోషించాడు.

అత‌ని ఎత్తు, ఉంగ‌రాల జుట్టు, పెద్ద గ‌డ్డం ఈ క్యార‌క్ట‌ర్‌కు బాగా సూట్ అయ్యాయి. కుడి కంటికింద ఆరిన గాయం తాలూకు మ‌చ్చ‌, దానికో స్టోరీ.. అన్నీ బాగా కుదిరాయి. శ్రీదేవి పాత్ర‌లో క‌నిపించిన పూజ హెగ్డే అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. అధ‌ర్వ‌ మురళికి తెలుగులో తొలి సినిమా అయినా మెప్పించాడు. అయితే.. ఆ పాత్ర‌ను తెలుగు హీరో చేసుంటే ఇంకా బాగుండేది. అత‌ను త‌న పాత్ర ప‌రిధి మేర బాగా చేశాడు. మృణాళిని అల్ల‌రి పిల్ల‌గా మెప్పించింది. సినిమా గురించి అవ‌కాశం గురించి త‌నికెళ్ల‌భ‌ర‌ణి చెప్పే డైలాగులు ఆక‌ట్టుకుంటాయి.

ఎల్లువొచ్చి గోదార‌మ్మ పాట సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా చెప్ప‌చ్చు. ఈ పాట‌లో వ‌రుణ్‌, పూజా మాత్రం ఒదిగిపోయారు. సెకండ్ హీరో అవ‌కాశం కోసం ప్ర‌య‌త్నించే చింత‌పండు వ్యాపారి కొండ‌మ‌ల్లిగా క‌మెడియ‌న్ స‌త్య పాత్ర బాగా పేలింది. ల‌వ్ స్టోరీ, మ‌ద‌ర్ సెంటిమెంట్, ఐటం సాంగ్...ఇలా ప్రేక్ష‌కులు కోరుకునే ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ అంశాలు పుష్క‌లంగా ఉన్నాయి. మాస్ సినిమాలు చూసేవాళ్ల‌కి ఈ సినిమా ఓ ఫుల్ మీల్ అనే చెప్పాలి.

రేటింగ్: 3/5

Next Story
Share it