ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేది వీళ్లే!

ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరనే అంశంపై ఉత్కంఠ వీడింది. ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే నలుగురు పేర్లను జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే ముగ్గురి పేర్లను ఖరారు చేసిన జగన్‌.. తాజాగా రాజ్యసభకు వెళ్లే నాలుగో వ్యక్తి ఎవరనేదానిపై స్పష్టత నిచ్చారు. ఏపీ నుంచి నాలుగో వ్యక్తిగా రాజ్యసభకు ముఖేష్‌ అంబానీ సన్నిహితుడు పరిమళ్‌ నత్వానిని పంపించనున్నారు.

ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో మొహద్‌ అలీఖాన్‌, టీ సుబ్బరామిరెడ్డి, కె. కేశవరావు, తోటా సీతారామ లక్ష్మీ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌ 9న ముగుస్తుంది. దీనికితోడు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాజ్యసభల పదవీకాలం ముగియనుంది. దీంతో వాటిని భర్తీ చేసేందుకు ఈనెల 26న ఓటింగ్‌ నిర్వహించనునన్నారు.  ఇప్పటికే అందుకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది.

కాగా ఏపీ నుంచి జగన్మోహన్‌రెడ్డి ఎవరిని రాజ్యసభకు పంపిస్తారా అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇటీవల శాసనమండలి రద్దుతో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో వారిని రాజ్యసభకు పంపించేందుకు జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. వీరితో పాటు గుంటూరు జిల్లాకు చెందిన అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు పంపించేందుకు జగన్‌ నిర్ణయించారు. మరోవైపు నాలుగో స్థానంలో రాజ్యసభకు ఎవరిని పంపిస్తారోననే ఉత్కంఠ నెలకొంది. దీంతో జగన్మోహన్‌రెడ్డి సోమవారం వైకాపా ముఖ్యనేతలతో భేటీ అయ్యి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబాని స్నేహితుడు పరిమళ్‌ నత్వానిని రాజ్యసభ సభకు పంపించేందుకు నిర్ణయించారు. దీంతో ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు ఎవరనే ఉత్కంఠకు జగన్మోహన్‌రెడ్డి తెరదించాడు. కాగా అధికారంగా వైకాపా పేర్లు ప్రకటించాల్సి ఉంది. మరోవైపు నాలుగో స్థానం నుంచి నత్వానికి బదులు ఎస్సీ, మైనార్టీల అభ్యర్థిత్వాన్నిసైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

సుబ్బరామిరెడ్డికి షాకిచ్చిన జగన్‌..

ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సుబ్బరామిరెడ్డి మరోసారి రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ సీఎం జగన్మోహన్‌రెడ్డి నత్వానిని రాజ్యసభకు పంపించేందుకు నిర్ణయించటంతో సుబ్బరామిరెడ్డికి షాకిచ్చినట్లయింది. జగన్‌ నత్వాని  పేరును ఖరారుచేసే దానికంటే ముందు .. సుబ్బరామిరెడ్డి జగన్మోహన్‌రెడ్డితో భేటీ అయ్యాడు. సీఎం క్యాంపు కార్యాలయంకు వెళ్లిన ఆయన జగన్‌తో భేటీ అయ్యి రాజ్యసభకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో అప్పటికే నత్వాని రాజ్యసభకు పంపించేందుకు జగన్‌ మోహన్‌రెడ్డి నిర్ణయించటంతో సుబ్బరామిరెడ్డికి ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్