రేపటి నుంచి తిరుమలలో ఉచిత లడ్డూ
By Newsmeter.Network Published on 19 Jan 2020 2:46 PM IST
తిరుపతి : శ‌్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుడు స్వామి వారి లడ్డూ ప్రసాదం తీసుకోకుండా వెనుదిరగరు. ఇప్పటి వరకు లడ్డూని రాయితీ విధానం లో అందించేవారు. రాయితీ లడ్డూ విధానానికి నేటితో తిరుమల తిరుపతి దేవస్థానం స్వస్తి పలకనుంది. నేటి అర్ధరాత్రి నుంచి కొత్త విధానం అమలు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
ప్రతి భక్తుడికీ ఉచితంగా ఒక్క లడ్డూ మాత్రమే అందిస్తామని, అదనపు లడ్డూ కోసం రూ.50 చొప్పున చెల్లించాలన్నారు. రోజుకు నాలుగు లక్షల లడ్డూలు తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో నడకదారిన వచ్చే భక్తులకు మాత్రమే ఒక ఉచిత లడ్డూను ఇచ్చేవారని, సేవా టిక్కెట్లు, వీఐపీ బ్రేక్, ప్రత్యేక దర్శనం చేసుకునే భక్తులకు కొత్త విధానం అమలు చేస్తున్నట్లు వివరించారు. భక్తులకు కావాల్సిన లడ్డూలు అందించేందుకు 12 ప్రత్యేక లడ్డూ కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.