మహబూబ్‌నగర్‌లో ఘరానా మోసం.. లబోదిబోమంటున్న వ్యాపారులు

By అంజి  Published on  6 Jan 2020 8:04 AM GMT
మహబూబ్‌నగర్‌లో ఘరానా మోసం.. లబోదిబోమంటున్న వ్యాపారులు

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘరానా మోసం బయటపడింది. జడ్చర్లలో ఓ బ్యాంక్‌ ఏజెంట్‌ తన చేతివాటం ప్రదర్శించాడు. రోజువారి డిపాజిట్‌ దారుల నుంచి తీసుకున్న నగదు బ్యాంకులో జమ చేయకుండా మోసగించాడు. జడ్చర్ల పట్టణంలోని సహకార బ్యాంకులో కోటి రూపాయల అవినీతి బాగోతం బట్టబయలు అయ్యింది. జిల్లా కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌లో పని చేస్తున్న జహంగీర్‌ అనే వ్యక్తి రోజు వారి డిపాజిట్లను సేకరించే నిర్వహణలో ఉన్నాడు. బ్యాంక్‌లో దాదాపు 200 మంది వ్యాపారుల రోజువారి డిపాజిట్‌ ఖాతాలను తెరిచారు. అయితే కాలవ్యవధి పూర్తైన తర్వాత కూడా.. వ్యాపారులకు బ్యాంక్‌ ద్వారా రావాల్సిన డబ్బులు రాలేదు. ఈ విషయమై కొంత మంది వ్యాపారులు బ్యాంక్‌ను ఆశ్రయించారు.

వ్యాపారులు వారి పాస్‌పుస్తకాలను బ్యాంక్‌ మేనేజర్‌కు చూపించారు.. అయితే పాస్‌పుస్తకాల్లో నమోదు చేసిన విధంగా బ్యాంకులో సదరు డబ్బు జమ కాలేదని మేనేజర్‌ వెల్లడించాడు. దీంతో వ్యాపారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దీంతో వ్యాపారులంతా రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఇప్పటిదాకా వ్యాపారుల ఖాతా పుస్తకాలను వెరిఫై చేయగా దాదాపు 70 లక్షల రూపాయల వరకు సదరు ఉద్యోగి దోచుకున్నట్లుగా వెల్లడైంది. తమ డబ్బులు తమకు ఇప్పించాలంటూ బాధిత వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు. రోజువారీ సంపాదించుకున్న డబ్బులు చివరికి దక్కకపోవడంతో వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.

Next Story