టీడీపీకి మరోషాక్.. రాజీనామా చేసిన మాజీఎమ్మెల్యే

స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. వైసీపీ ఆపరేషన్‌ ఆకర్స్‌ పేరుతో టీడీపీలోని ముఖ్యనేతలను ఒక్కొక్కరిగా వైసీపీలోకి లాగుతుండటంతో అటు టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. వైసీపీ వ్యూహాలకు ఎలా అడ్డకుకట్ట వేయాలో అనే ఆలోచించేలోపు ఒక్కొక్కరుగా రాజీనామా పత్రాలు అధినేత చంద్రబాబుకు పంపిస్తున్నారు.

ఇప్పటికే కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేయగా తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే కూడా టీడీపీ గుడ్‌బై చెప్పారు. యలమంచి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు టీడీపీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీలు కూడా టీడీపీని వీడారు. త్వరలో అనుచరుల సమావేశం ఏర్పాటు చేసిన వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

గత ఆరు నెలలుగా వైసీపీ సీనియర్‌ నేత తోట త్రిమూర్తులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్థానికంగా చర్చసాగుతుంది. దీంతో జగన్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావటంతో రమేష్‌బాబు టీడీపీకి గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. రమేష్‌బాబు 2014 సాధారణ ఎన్నికల్లో విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి నాగేశ్వరరావుపై విజయం సాధించాడు.

2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కన్నబాబు రాజు చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాలకు రమేష్‌ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల చంద్రబాబు విశాఖలో పర్యటించే సమయంలో కూడా చంద్రబాబు పర్యటనలో పాల్గొనేందుకు ఆసక్తి కనబర్చలేదు. టీడీపీకి రాజీనామా చేసిన సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ.. చంద్రబాబు నిర్ణయాలను తీవ్రంగా తప్పుబట్టారు. అమరావతి రాజధాని రైతుల కోసం పోరాడటంలో తప్పులేదని, అలా అని విశాఖను రాజధానిగా వద్దు అనడం సరికాదని అన్నారు. విశాఖలో రాజధానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని చెప్పారని, అది సరైంది కాదని అన్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *