ఎన్నికల సంస్కర్త శేషన్ ఇకలేరు..!
By న్యూస్‌మీటర్ తెలుగు
ముఖ్యాంశాలు
- కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ టీఎన్ శేషన్ కన్నుమూత
- చెన్నైలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూసిన శేషన్
- శేషన్‌కు ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు సహా పలువురు సంతాపం
చెన్నై: కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మాజీ కమిషన్ టీఎన్ శేషన్ (87) కన్నుమూశారు. చెన్నైలోని ఆడయారులో తన నివాసంలో ఆదివారం రాత్రి శేషన్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శేషన్ పూర్తి పేరు తిరునళ్లై నారాయణ అయ్యర్ శేషన్. కేంద్ర ఎన్నికల సంఘం 10వ కమిషనర్‌గా శేషన్ విధులు నిర్వర్తించారు. శేషన్ మృతితో కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ శకం ముగిసినట్లయింది. శేషన్ ఆదివారం రాత్రి 9.30 గంటలకు కన్నుమూసినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ డాక్టర్ సయ్యద్ ఖురేషి ప్రకటించారు. 1990 నుంచి 1996 వరకూ శేషన్ ఎన్నికల సంఘం కమిషనర్‌గా పని చేశారు.
శేషన్ కేరళలోని పాలక్కడ్ జిల్లాత తిరునెళ్లైలో 1932 సంవత్సరంలో జన్మించారు. ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన శేషన్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రభుత్వ పాలన శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. తమిళనాడు 1955 బ్యాచ్ ఐఏఎస్ క్యాడర్ అధికారి శేషన్. 1989లో సెంట్రల్ కేబినెట్ సెక్రటరీగా కూడా ఆయన విధులు నిర్వర్తించారు. శేషన్ ఎన్నికల సంఘంలో ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తనకున్న అధికారాన్ని ఉపయోగించి కీలక నిర్ణయాలతో రాజకీయ నేతలను వణికించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అమలు చేయడం ద్వారా శేషన్ విశేష గుర్తింపును సాధించారు. శేషన్ ఎన్నికల సంస్కరణలో చేసిన సేవలకు గానూ 1996లో రామన్ మెగసెసె అవార్డును అందుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే శేషన్ ముందు.. శేషన్ తర్వాత అని చెప్పాల్సిందే. ఎన్నికల సంఘంలో శేషన్ చేసిన సేవలు అలాంటివి మరీ.
ఎన్.శేషన్ మృతిపట్ల ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. శేషన్ మృతిపట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. శేషన్ నిజాయితీకి, అంకిత భావానికి నిలువుటద్దమని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం చరిత్రలో శేషన్ పేరు నిలిచిపోతుందని సీఎం అన్నారు.