సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు. నామినేటెడ్‌ సభ్యుల కోటాలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనను నియమించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీ అయిన నామినేటెడ్‌ సభ్యుడి స్థానంలో జస్టిస్‌ గొగోయ్‌ని రాష్ట్రపతి నియమించినట్లు హోంశాఖ పేర్కొంది.

ఇదిలా ఉంటే గొగోయ్‌ నియామకంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆయన నియామకం వెనుక క్విడ్‌ ప్రో కో ఉందంటూ కాంగ్రెస్‌, ఆమాద్మీ పార్టీ, ఎంఐఎం సహా పలు పార్టీలు ఆరోపించాయి. కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య  మాట్లాడుతూ.. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా భారత ప్రజలకు, భవిష్యత్ సీజేఐలకు రాష్ట్రపతి ఎలాంటి సందేశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ.. ఈ నిర్ణయంతో న్యాయ వ్యవస్థ స్వతంత్ర్రత దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Also Read :ఎన్నికలకు, ఆర్థిక సంఘం నిధులకు లింక్ పెట్టొద్దు.. – ఎస్ఈసీ

ఆమాద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఘవ్‌ చద్దా ట్విటర్‌లో స్పందిస్తూ.. గతేడాది  మార్చిలో నాటి సీజేఐ రంజన్‌ గొగోయ్‌ వ్యాఖ్యలను ఉటంకించారు. న్యాయమూర్తుల పదవీ విరమణ తర్వాత వారికి పదవులు ఇవ్వడం న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యానికే మాయని మచ్చ.. అంటూ నాడు గొగోయ్‌ పేర్కొన్నారని అన్నారు. ఇదిలా ఉంటే 2018 అక్టోబర్‌ ౩ నుంచి 2019 నవంబర్‌ 17 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రంజన్‌ గొగోయ్‌.. గతేడాది నవంబర్‌ 17న రిటైరయ్యారు. రామజన్మభూమి వివాదానికి న్యాయప్రక్రియ ద్వారా శాశ్వత పరిష్కారం చూపడంలో గొగోయ్‌ కీలక భూమిక పోషించారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.