'ఎస్‌బ్యాంక్'లో 49శాతం పెట్టుబడులు పెట్టనున్న ఎస్‌బీఐ..!
By తోట వంశీ కుమార్ Published on 6 March 2020 4:30 PM GMTఎస్‌బ్యాంక్ ఖాతాదారుల నగదు సురక్షితంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఈ విషయమై ఇప్పటికే ఆర్‌బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గవర్నర్ శక్తికాంతదాస్‌తో మాట్లాడానన్నారు. సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంక్ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆమె తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం ఆర్‌బీఐ కలిసి పనిచేస్తాయన్నారు. ఖాతాదారుల, బ్యాంక్, ఆర్థిక వ్యవస్థల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఖాతాదారులకు ప్రస్తుతం రూ.50వేల వరకు తీసుకునేలా ఏర్పాట్లు చేయడమే తమ ముందున్న తొలి లక్ష్యమన్నారు.
బ్యాంకు సంక్షోభం పై ప్రభుత్వం 2017లోనే అప్రమత్తమైందన్నారు. సదరు బ్యాంకులో పాలనా పరమైనా ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించామని, సంక్షోమం నుంచి గట్టెక్కించేందుకు ప్రణాళికలు రచించామని తెలిపారు. ఎస్‌బ్యాంకులో 49శాతం పెట్టుబడులు పెట్టేందుకు ఎస్‌బీఐ ఆసక్తి చూపిందన్నారు. అంతేకాకుండా ఎస్‌బ్యాంకుకు నూతన పాలకవర్గం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బ్యాంకులో పనిచేసే ఉద్యోగులు, వారి జీతాలకు ఏడాది వరకు హామీ ఇస్తున్నట్లు స్ఫష్టం చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకులను బలవంతంగా విలీనం చేసి బ్యాంకింగ్ రంగాన్ని నాశనం చేసిందని విమర్శించారు.