ఆ ఐదుగురు చరిత్ర లిఖించారు...!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Nov 2019 8:45 AM GMT
ఆ ఐదుగురు చరిత్ర లిఖించారు...!

న్యూఢిల్లీ : ఆ ఐదుగురు న్యాయమూర్తులు చరిత్ర లిఖించారు. అయోధ్య కేసును రోజువారి విచారణ చేపట్టి పరిష్కరించారు. చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలోని జస్టిస్ బోబ్డే, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా శనివారం తుదితీర్పును వెల్లడించింది. మధ్యవర్తిత్వం విఫలమైన తర్వాత ఈ ఏడాది ఆగస్టు 6వ తేదీ నుంచి రోజువారీ విచారణ చేపట్టారు.

ఈ కేసులోసుప్రీంకోర్టు 40 రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు వింది. ఈ ఏడాది సెప్టెంబర్ 16న అత్యున్నత న్యాయస్థానంలో విచారణ ముగిసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి భారత అత్యున్నత న్యాయస్థానం ముగింపు పలికింది. ఈ సందర్భంగా సీజేఐ రంజన్ గోగోయ్ నేతత్వంలోని జస్టిస్ బోబ్డే, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లు ఏకగ్రీవ తీర్పు ఇచ్చారు. ఆ న్యాయమూర్తుల వివరాలు చూద్దాం

సీజేఐ రంజన్ గోగోయ్

అయోధ్య కేసుకు సీజేఐ రంజన్ గోగోయ్ నేతృత్వం వహించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అక్టోబర్ 3, 2018న బాధ్యతలు చేపట్టారు . నవంబర్ 18,1954న జన్మించిన జస్టిస్ రంజన్ గొగోయ్ 1978 లో బార్ కౌన్సిల్‌లో చేరారు. గౌహతి హైకోర్టులో లాయర్ గా కెరీర్ ను స్టార్ట్ చేశారు. 2001లో గౌహతి హైకోర్టులో గొగోయ్ లాయర్‌ గా వాదనలు చేపట్టారు. అనంతరం 2010 లో పంజాబ్ ,హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011 లో పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2012, ఏప్రిల్ 23న జస్టిస్ రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. గోగోయ్ నవంబర్ 17న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన హయాంలోనే అయోధ్య పై తీర్పు రావడం చరిత్రలో నిలిచిపోనుంది.

జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్

జస్టిస్ డి.వై.చంద్రచుడ్ 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేశారు. శబరిమల, భీమా కోరెగావ్, స్వలింగసంపర్కంతో సహా పలు పెద్ద కేసు బెంచ్‌లో ఈయన భాగస్వామి . ఆయన తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు.

జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే (ఎస్‌ఏ బొబ్డే)

రంజన్ గోగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనంలో రెండవ న్యాయమూర్తి జస్టిస్ ఎస్. ఏ బోబ్డే. 2013 లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు . రంజన్ గోగోయ్ పదవీ విరమణ పొందిన అనంతరం ఎస్ఏ బొబ్డే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

జస్టిస్ అబ్దుల్ నజీర్

అయోధ్య కేసు బెంచ్‌లో ఉన్న జస్టిస్ అబ్దుల్ నజీర్ 1983 లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. కర్ణాటక హైకోర్టులో లాయర్‌గా నజీర్ ప్రాక్టీస్ చేశారు. ఆ తరువాత అదనపు న్యాయమూర్తి, శాశ్వత న్యాయమూర్తిగా పనిచేశారు. ఫిబ్రవరి 17, 2017 న సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

జస్టిస్ అశోక్ భూషణ్

ఉత్తరప్రదేశ్‌కు చెందిన జస్టిస్ అశోక్ భూషణ్ మే13, 2016న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఉత్తరప్రదేశ్ బార్ కౌన్సిల్ లో 1979లో చేరారు. కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా సేవలందించారు.

Next Story