రాష్ట్రంలో మొట్టమొదటి జీరో ఎఫ్ఐఆర్ కేసు న‌మోదు.. ఎక్క‌డంటే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Dec 2019 2:22 PM GMT
రాష్ట్రంలో మొట్టమొదటి జీరో ఎఫ్ఐఆర్ కేసు న‌మోదు.. ఎక్క‌డంటే..

రాష్ట్రంలో మొట్టమొదటి జీరో ఎఫ్ఐఆర్ కేసును వరంగల్ కమిషనరేట్ ప‌రిధిలోని సుబేదారి పోలీసులు నమోదు చేశారు. వివరాల్లోకెళితే.. వరంగల్ రూరల్ జిల్లా, శాయంపేట మండలం గోవిందాపూర్ గ్రామానికి చెందిన బూర రవీందర్ కుమార్తె శ్రీ విద్య(24) సంవత్సరాలు కనిపించడం లేదు. అయితే.. ఈ విష‌య‌మై వరంగల్ లోని కాశీబుగ్గలోని త‌న త‌మ్ముడు బూర రాజ్ కుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు.

వెంట‌నే అప్రమత్తమయిన రాజ్ కుమార్ తక్షణమే సుబేదారి పోలీస స్టేషన్ కు వెళ్ళి తన అన్నకుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. వెంట‌నే స్టేషన్ ఎస్సై సత్యనారాయణ జీరో ఎఫ్ఐఆర్ గా కేసు నమోదు చేసుకోని.. కేసు దర్యాప్తు నిమిత్తం సంబంధిత పోలీస్ స్టేషన్ కు కేసును బదీలీ చేశారు.

షాద్‌న‌గ‌ర్ శివారులో వెటర్నరీ వైద్యురాలు దిశ మిస్సింగ్ విషయంలో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లగా.. పోలీసులు తమ పరిధి కాదని, మరో స్టేషన్‌కు వెళ్లాలని సూచించిన‌ట్టు వార్తలు రావడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడైనా.. బాధితుల నుంచి ఏ పోలీస్ స్టేషన్‌కు మొట్టమొదట ఫిర్యాదు వస్తే.. అక్కడే తీసుకోవాలని నిబంధనలు పెట్టారు. ఈ మేరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో మొట్టమొదటి జీరో ఎఫ్ఐఆర్ కేసు న‌మోదైంది.

Next Story