డిగ్రీ, పీజీ కాలేజీలు ప్రారంభంపై యూజీసీ ప్రకటన.. సెలవుల్లో కోత
By తోట వంశీ కుమార్ Published on 23 Sep 2020 7:46 AM GMTడిగ్రీ, పీజీ కళాశాలు పునః ప్రారంభం పై ఓ క్లారిటీ వచ్చింది. కొత్త అకడమిక్ క్యాలెండర్‌ను యూజీసీ(యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) విడుదల చేసింది. అక్టోబర్ చివరి నాటికి ప్రవేశాల ప్రక్రియను పూర్తిచేసి నవంబర్ 1 నుంచి యూజీ, పీజీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించాలని యూజీసీ అన్ని విశ్వ విద్యాలయాలను ఆదేశించింది. ఈ మేరకు సవరించిన యూజీసీ అకడమిక్ క్యాలెండరును కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విటర్ ద్వారా విడుదల చేశారు.
శీతాకాల, వేసవి సెలవుల్లో కోతలు విధించాలని సూచించింది. ఈ ఏడాది విద్యార్థులు సకాలంలో డిగ్రీ పట్టా పొందేలా వచ్చే ఏడాది విద్యా సంవత్సరాన్ని త్వరగా ప్రారంభించాలని చెప్పింది. ఇక వారానికి ఆరు రోజులు పాఠాలు బోధించడం ద్వారా నష్టపోయిన విద్యా సమయాన్ని భర్తీ చేయొచ్చని యూజీసీ పేర్కొంది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి తొలి రెండు సెమిస్టర్ల పరీక్ష తేదీలను ఇప్పటికే యూజీసీ అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ అన్ని యూనివర్శిటీల పరిధుల్లోని డిగ్రీ, పీజీ ఫస్ట్ ఇయర్ తరగతులను యూజీసీ షెడ్యూల్ ప్రకారం ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి సమాయత్తమవుతోంది. దీనిపై త్వరలో అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య తుమ్మల పాపిరెడ్డి వివరించారు.
తొలుత ఏప్రిల్ 29న 2020-21 అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన యూజీసీ.. కరోనా కారణంగా విద్యాసంస్థలన్నీ మూతపడటంతో ఇప్పుడు కొత్త క్యాలెండర్ ను ఆవిష్కరించింది. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి నవంబర్ 30వ తేదీ వరకూ ఆయా యూనివర్శిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఉన్న విద్యార్థులు అడ్మిషన్లు క్యాన్సిల్ చేసుకున్నారు. అలా అడ్మిషన్లు క్యాన్సిల్ చేసుకున్న, వలస వెళ్లిన విద్యార్థులకు ఫీజులను తిరిగి చెల్లించాలని కేంద్ర విద్యాశాఖమంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ యూనివర్శిటీలకు సూచించారు. కరోనా క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
తల్లిదండ్రులు విద్యార్థులను స్కూళ్లు, కాలేజీలకు పంపేందుకు వెనకాడుతున్నారు. బయటికి వెళ్లిన పిల్లలకు ఎక్కడ కరోనా సోకుతుందా అన్న భయం తల్లిదండ్రులను వెంటాడుతోంది. పోనీ ఆన్ లైన్ లోనే ఈ విద్యా సంవత్సరం కొనసాగించాలన్నా కష్టంగానే ఉంది. ఇప్పటికే ఆన్ లైన్ తరగతుల నిర్వహణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.