బ్రేకింగ్: తెలంగాణలో కరోనాకు బలైన తొలి డాక్టర్‌

By సుభాష్  Published on  22 Jun 2020 12:29 PM IST
బ్రేకింగ్: తెలంగాణలో కరోనాకు బలైన తొలి డాక్టర్‌

తెలంగాణలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత భయాందోళన నెలకొంది. ఇక హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో మాత్రం గజగజవణికిస్తోంది. రోజు వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇక తాజాగా కరోనాకు తొలి డాక్టర్‌ బలయ్యాడు. ఖైరతాబాద్‌లో నాలుగు దశాబ్దాలుగా ప్రాక్టీస్‌ చేస్తున్న ఈ వైద్యుడు జ్వరంతో ఈనెల 16వ తేదీన కిమ్స్‌ ఆస్ప్రత్రిలో చేరారు. వైద్యునికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఈనెల 18న కరోనా పాజిటివ్‌ వచ్చింది. చికిత్స పొందుతూ రాత్రి మరణించారు.

ఇక తాజాగా నిన్న ఒక్క రోజు రాష్ట్రంలో 730 కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 7802 కేసులు నమోదు కాగా, 210 మంది మృతి చెందారు. ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 659 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్య‌ధికంగా జ‌న‌గాం జిల్లాలో 34 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 10 కేసులు, మేడ్చ‌ల్ జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి. గ‌త వారం రోజులుగా తెలంగాణ‌లో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్ర క‌ల‌వ‌రం చెందుతున్నారు.

ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 3861 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 3731 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 225 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Next Story