Fact Check : కరోనా టీకా ప్రయోగంలో తొలి మహిళ మృతి చెందిందా ? వెబ్‌సైట్‌లో ప్రచురించిన వార్త నిజమేనా ?

By Newsmeter.Network  Published on  27 April 2020 5:43 PM IST
Fact Check : కరోనా టీకా ప్రయోగంలో తొలి మహిళ మృతి చెందిందా ? వెబ్‌సైట్‌లో ప్రచురించిన వార్త నిజమేనా ?

నాలుగు రోజుల కిందట ఓ వార్త అందరినీ సంతోషానికి గురిచేసింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో కరోనా టీకా తయారీలో పురోగతికి సంబంధించిన వార్త అది. మనుషులపై ప్రయోగాలు కూడా మొదలెట్టేశారు. ఆ వీడియోను అధికారికంగా రిలీజ్‌ చేశారు కూడా. ఈ సమాచారం తెలుసుకున్న వాళ్లంతా.. ఇక కరోనా టీకా త్వరలోనే వచ్చేస్తుందన్న ధీమాతో ఉన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారికి విరుగుడు త్వరలోనే దొరకబోతోందని చెప్పుకున్నారు. పరిశోధకులు కూడా ప్రయోగాలను ఇకపై మరింత వేగవంతం చేస్తామని ప్రకటించారు.

అయితే.. ప్రయోగం కోసం మొట్టమొదటి టీకా వేయించుకున్న మహిళ చనిపోయిందన్న వార్త వైరల్‌గా మారింది. తొలి వాలంటీర్‌ చనిపోయిందంటూ ఓ వెబ్‌సైట్‌లో వార్త ప్రచురించారు. దీంతో.. చాలామందిలో టెన్షన్‌ మొదలయ్యింది. టీకా వేయించుకున్న రెండు రోజుల తర్వాత ఎలిసా గ్రానాటో అనే మహిళ చనిపోయారంటూ ఆ వార్తలో పేర్కొనడంతో ఇది చదివిన వాళ్లలో కరోనాపై భయం రెట్టింపయ్యింది. https://n5ti.com/stories/1275/ ఈ తప్పుడు వెబ్‌సైట్‌లో ఆ వార్తను ప్రచురించారు. జేమ్స్‌ అలమి అనే వ్యక్తి ఈ వార్త రాశారు. అంతేకాదు.. పరిశోధకులు ఈ పరిణామంతో అవాక్కయ్యారని, ఎలిసా ఎందుకు చనిపోయిందో కారణాలు వెతికే పనిలో పడ్డారని కూడా ప్రచురించారు. ఇక.. ఎలిసా గ్రానాటో మరణంపై పరిశోధకులే ప్రకటన విడుదల చేశారని కూడా పేర్కొన్నారు. అంతేకాదు.. మరో నలుగురు వాలంటీర్లు కూడా ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నారని రాశారు.

F1

కానీ, ఇది తప్పుడు వార్త. కరోనాపై టీకా తయారుచేసే అంశంలో ఎలిసా గ్రానాటో వాలంటీర్‌గా నమోదు చేసుకున్నారు. ఆమెతో పాటు.. మరికొందరు కూడా ప్రయోగాలకు అంగీకరించారు. అయితే.. ఈ ప్రయోగానికి అంగీకరించిన తొలి మహిళ గ్రానాటో. కానీ, గ్రానాటో చనిపోలేదు. ఆమె సురక్షితంగానే ఉంది. ఈ తప్పుడు వార్తకు సంబంధించి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన వార్తకు Aidan రిప్లై ఇచ్చారు. తప్పుడు ఉద్దేశ్యంతో ఈ వార్తను ప్రచురించారని స్పష్టం చేశారు.

F2

కరోనా పేరు వింటేనే భయం పుడుతోంది. ఆ మాట ఎక్కడ వినబడినా నిలువెల్లా వణికిపోయే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో మనుషులపై టీకా ప్రయోగాలు మొదలయ్యాయన్న శుభవార్తపై నీళ్లు చల్లేలా తప్పుడు వార్తను సృష్టించారు. https://n5ti.com/stories/1275/ వెబ్‌సైట్‌లో ప్రచురించిన వార్త తప్పుడు వార్త.

ప్రచారం : కరోనా టీకా ప్రయోగంలో వాక్సిన్‌ వేయించుకున్న తొలి మహిళ 'ఎలిసా గ్రానాటో' మృతి

వాస్తవం : ఎలిసా గ్రానాటో చనిపోలేదు. ఈ వార్త తప్పుడు వార్త.

కంక్లూజన్‌ : జనంలో భయాందోళన సృష్టించడమే లక్ష్యంగా ఈ వార్తను పోస్ట్‌ చేసినట్లు అర్థమవుతోంది.

- సుజాత గోపగోని

Claim Review:Fact Check : కరోనా టీకా ప్రయోగంలో తొలి మహిళ మృతి చెందిందా ? వెబ్‌సైట్‌లో ప్రచురించిన వార్త నిజమేనా ?
Claim Fact Check:false
Next Story