భారత్‌లోకి  కరోనా వైరస్‌.. ఒకరిని గుర్తించిన వైద్యులు

By సుభాష్  Published on  30 Jan 2020 10:33 AM GMT
భారత్‌లోకి  కరోనా వైరస్‌.. ఒకరిని గుర్తించిన వైద్యులు

కరోనా వైరస్‌.. ఇది ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత్‌లోకి ప్రవేశించింది. కేరళకు చెందిన ఓ విద్యార్థికి ఈ కరోనా వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థికి ఈ వైరల్‌ లక్షణాలు ఉన్నట్లు అనుమానం రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆ విద్యార్థి కేరళలోని ఓ ఆస్పత్రిలో ప్రత్యేక విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ధృవీకరించింది. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. విద్యార్థిని అబ్జర్వేషన్‌లో ఉంచి పరిశీలిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా, విద్యార్థి చైనాలోని వుహాన్‌ యూనివర్సిటీలో మెడిసిన్‌ చదువుతున్నాడు.

ఇదిలా ఉండగా, చైనాలో చదువుకుంటున్న 23 వేలకుపైగా భారతీయులు స్వదేశానికి తీసుకురావడానికి విదేశాంగ శాఖ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. చైనా నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షించడానికి విమానాశ్రయంలో ప్రత్యేక థర్మల్‌ స్కానింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు నమోదు చేసుకుని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చైనాలో ఈ వైరస్ బారిన ఇప్పటికే 170 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

అలాగే మహారాష్ట్రలో కరోనా వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన పది మందికి ప్రత్యేక విభాగంలో చికిత్స అందిస్తున్నారు. వీరికి కరోనా వైరస్ లక్షణాలున్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదు. కరోనా వైరస్‌ను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్రం బృందం త్వరలో వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Next Story