భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం
By సుభాష్ Published on 4 Sep 2020 5:14 AM GMTఈ మధ్య అగ్నిప్రమాదాలు పెరిగిపోతున్నాయి. కారణాలు ఏవైనా.. అగ్ని ప్రమాదాల కారణంగా భారీ నష్టంతో పాటు కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా తమిళనాడులో శుక్రవారం ఉదయం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం అయ్యారు. సేలం జిల్లాలోని కురుంగచావడి గ్రామంలో అన్బళగన్ అనే వ్యక్తి ఇంట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి నిద్రలో నుంచి తెరుకున్న వారు.. తప్పించుకునేందుకు ప్రయత్నించగా, వీలు కాలేకపోయింది. దీంతో కుటుంబంలోని ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. అన్బళగన్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు స్పందించి గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ నేతృత్వంలో సూరమంగళం, షెవపేటకు చెందిన అగ్నిమాపక కేంద్రాల శకటాలు వచ్చి మంటలు అదుపులోకి తెచ్చారు. అయితే ఇంట్లో మొత్తం 10 మంది ఉండగా, అందులో ఐదుగురు సజీవ దహనం కాగా, ఒకరు గాయపడ్డారు. మిగతా వారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ప్రాథమికంగా దర్యాప్తు ఆధారంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు వ్యాపించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
ఘటన స్థలానికి పోలీసులు కూడా చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. మృతులు పుష్ప (40), ఆమె బావ కార్తీక్ (38) , ఆయన భార్య మహేశ్శరి (34) వారి పిల్లలు సర్వేష్ (12), ముఖేష్ (9) ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎస్.ఎ. రామన్, నగర పోలీసు కమిషనర్ టి. సెంథిల్ కుమార్, ఇతర అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.