బ్రేకింగ్: శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణమహోత్సవ రథం దగ్ధం

By సుభాష్  Published on  6 Sept 2020 7:55 AM IST
బ్రేకింగ్: శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణమహోత్సవ రథం దగ్ధం

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ది పుణ్యక్షేత్రం అయిన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహాస్వామి కల్యాణమహోత్సవ రథం దగ్ధం అయ్యింది. శనివారం అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతి సంవత్సరంలాగే కల్యాణ మహోత్సవంలో ఉత్సవ మూర్తులను రథంపై ఉంచి ఊరేగిస్తారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్డులో భద్రపరుస్తారు. రాత్రి ఒంటగంట సమయంలో కస్మాత్తుగా మంటలు చెలరేగడంతో రథం పూర్తిగా దగ్ధమైంది. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, ఎవ‌రైనా కావాల‌ని చేశారా అనే కోణాల‌పై పోలీసులు విచారణ చేపట్టారు. ఆలయ నిర్వాహకుల తెలిపిన వివరాల ప్రకారం.. 40 అడుగుల ఎత్తైన రథాన్ని 60 సంవత్సరాల కిందట తయారు చేశారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ప్రతియేటా ఇక్కడ ఘనంగారథోత్సవాన్ని నిర్వహించడం అనవాయితీగా వస్తోంది.

కాగా, సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణాన్ని ప్రతియేటా మాఘ మాసంలో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ సమయంలో రథోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. రాజమహేంద్రవరం దగ్గర వశిష్ఠ, వైనతేయ, గౌతమి పాయలుగా విడిపోయిన గోదావరిని వశిష్ఠ మహర్షి గౌతమి నది నుంచి పాయను తీసుకువచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిపారని పురాణగాథ.

నాసిక్‌లో పుట్టిన గోదావరి అంతర్వేది వద్ద సంగమం చేయడం వల్ల ఇక్కడ పుష్కర స్నానం చేసినట్లయితే సర్వపాపాలు తొలగిపోయి పుణ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఏడు జన్మల పాపాలు నశిస్తాయని నమ్ముతారు. అయితే ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిర్ణయించి యాగానికి వేదికగా ఎంచుకోవడం వల్ల ప్రస్తుతం ఈ ప్రదేశానికి 'అంతర్వేది' అని పేరు వచ్చినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ ఊరేగింపు రథం అకస్మాత్తుగా దగ్ధం కావడంతో భక్తులు భయాందోళన చెందారు. స్వామివారి రథం దగ్ధం కావడం ఏమిటని ఆందోళనకు గురవుతున్నారు.

Next Story