ప్రతి ఇంటికి రూ.10వేల ఆర్థిక సాయం.. ఇల్లు కూలిపోయిన వారికి లక్ష: కేసీఆర్
By సుభాష్ Published on 19 Oct 2020 4:55 PM ISTభాగ్యనగరంలో వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది. వరద ప్రభావానికి ఇప్పటికే చాలా కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. దాదాపు 33 మంది ప్రాణాలు కోల్పోగా, పలు వాహనాలు సైతం వరదల్లో కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయారు. వరద ప్రభావానికి నష్టపోయిన ప్రతి ఇంటికీ రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. మంగళవారం నుంచే ఈ ఆర్థిక సాయం అందజేయనున్నట్లు చెప్పారు. ఈ మేరకు వరదలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్..ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
వరదల కారణంగా హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరదల ధాటికి గురైన వారికి ఆర్థిక సాయానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు బృందాలుగా ఏర్పడాలని, అందరికీ సాయం అందించేలా చూడాలని కేసీఆర్ ఆదేశించారు.
పూర్తిగా ఇల్లు కూలిపోయిన వారికి లక్ష సాయం
భారీ వర్షాల కారణంగా పూర్తిగా ఇల్లు కూలిపోయిన వారికి లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా రహదారులు సైతం దెబ్బతిన్నాయి. వాటికి మరమ్మతులు, మౌలిక సదుపాయల కల్పనకు యుద్దప్రతిపాదికన చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. పేదలకు సాయం చేసేందుకు పురపాక శాఖకు రూ.550 కోట్లు తక్షణమే విడుదల చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.