మహారాష్ట్రలో నువ్వా - నేనా సై..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2019 11:38 AM GMT
మహారాష్ట్రలో నువ్వా - నేనా సై..!

మహారాష్ట్ర రాజకీయం మరింత ముదురుతోంది. పాత మిత్రులు బీజేపీ-శివసేన మధ్య కీచులాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. తాజాగా శివసేన నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బీజేపీతో సమావేశాన్ని శివసేన రద్దు చేసుకుంది. ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడానికి బీజేపీ ససేమిరా అనడంతో శివసేన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హర్యానా లో ఉన్నట్లు మహారాష్ట్రలో దుష్యంత్‌లు ఎవరూ లేరని బీజేపీకి చురకలంటించారు. లోక్‌సభ ఎన్నికల పొత్తుకు ముందే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 50-50 ఫార్ములాకు బీజేపీ ఒప్పుకుందని, ఇప్పుడు బీజేపీ మాట నిలుపుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే, సీఎం దేవేంద్ర పఢ్నవిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిని తానేనని ఫడ్నవిస్ కుండబద్దలు కొట్టారు. మరో ఐదేళ్లపాటు తానే సీఎంగా ఉంటానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవిని పంచుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అసలు 50-50 ఫార్ములా గురించి తామెప్పుడు శివసేనతో చర్చించలేదని చెప్పారు. బీజేపీ చీఫ్ అమిత్ షాతో చర్చలు జరిగిన సమయంలో కూడా ఫిఫ్టి-ఫిఫ్టీ ఫార్మూల ప్రస్తావనే రాలేదన్నారు. శివసేన నుంచి తమకు లిఖితపూర్వకంగా ఎలాంటి డిమాండ్లు రాలేదన్నారు. ప్రతిపాదనలు వచ్చినప్పుడు ప్రాధాన్యతను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

రాష్ట్రంలో త్వరలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని, ప్రతిభ ఆధారంగానే పదవుల కేటాయింపు ఉంటుందన్నారు.

బీజేపీ-శివసేన పొత్తుకు బీటలు వారే పరిస్థితి కనిపిస్తుండడంతో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలతో శివసేన జట్టు కట్టే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. తమకు ఇతర పార్టీల నుం చి కూడా ఆఫర్లు ఉన్నాయని సంజయ్ రౌత్ చెప్పకనే చెప్పారు. తమకు అధికారదాహం లేదని అంటూనే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సిన ఆగత్యం ఏర్పడితే చేసేదేమీ లేదని చెప్పుకొచ్చారు. శివ సేన వ్యవహారాన్ని బీజేపీ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది. పార్టీ చీఫ్ అమిత్ షా బుధవారం మహారాష్ట్రకు రానున్నారు. బుధవారం మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో బీజేపీ శాసనసభాపక్షనేతగా ఫడ్నవిస్‌ను ఎన్నుకుంటారు. తమకు 10 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల మద్ధతు ఉందని, మరో ఐదుగురు కూడా సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story